విశాఖపట్టణం, ఏప్రిల్ 1(way2newstv.com)
విశాఖపట్నం సిటీ పరిధిలోకి వచ్చే నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన విశాఖ నార్త్ లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుతో రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు హోరాహోరీ తలపడుతున్నారు. వైసీపీ తరఫున కేకే రాజు బరిలో ఉన్నారు. ఇద్దరు క్షత్రియ అభ్యర్ధుల మధ్య ఓట్ల చీలికపై మంత్రి గంటా శ్రీనివాస్ గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన విశాఖ నార్త్ నియోజకవర్గానికి ఇప్పటివరకూ రెండుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి తైనాల విజయ్ కుమార్, గత ఎన్నికల్లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఇక్కడ నుంచి గెలుపొందారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండున్నర లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపుల జనాభా అత్యధికం. తర్వాతి స్ధానాల్లో రెడ్లు, ఎస్సీలు, బీసీలు, క్షత్రియులు ఉన్నారు. వీరిలో కాపులు, బీసీల మద్దతు ఉన్న వారికే విజయం సాధ్యంకావచ్చు.గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు... 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి వెంకట్రావును ఓడించారు.
విశాఖలో రాజులు వర్సెస్ కాపులు
అప్పట్లో జనసేన పోటీలో లేకపోవడం, టీడీపీ, జనసేన మద్దతు కూడా ఉండటంతో విష్ణుకుమార్ రాజు విజయం సునాయాసమైంది. కానీ గత రెండేళ్లలో పరిస్ధితులు మారాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత టీడీపీ నేరుగా బీజేపీపై ఎదురుదాడికి దిగడం, జనసేన కూడా దూరం కావడంతో ఈసారి విష్ణుకుమార్ రాజు విజయం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కూడా కేకే రాజు రూపంలో క్షత్రియ అభ్యర్ధిని రంగంలో దింపడంతో వీరిద్దరి మధ్య ఓట్ల చీలిక అనివార్యం కానుంది. అదే సమయంలో కాపుల మద్దతు లభిస్తుందన్న ఆశతో మంత్రి గంటా శ్రీనివాస్ ను టీడీపీ రంగంలోకి దింపింది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీలు, మైనార్టీల ఓట్ల అండతో వైసీపీ రాజకీయాలు చేస్తోంది. కేకే రాజు రూపంలో క్షత్రియ సామాజికవర్గ నేత కూడా రంగంలో ఉండటంతో ఈసారి వీరి ఓట్లు కూడా పడతాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఇక రిజర్వేషన్ల హామీ నెరవేరకపోవడంతో కాపులు ఈసారి టీడీపీకి దూరం కావచ్చనే సంకేతాలు ఉన్నాయి. అలాగే టీడీపీతో పోలిస్తే బీసీలకు ఎక్కువ హామీలు ఇచ్చిన వైసీపీ ఈసారి వీరి ఓట్లు ఏ మేరకు సాధిస్తుందో చూడాలి. ఆయా వర్గాలన్నీ వెంట నిలిస్తే గంటా, విష్ణుకుమార్ రాజుపై కేకే రాజు విజయం సాధించే అవకాశాలూ లేకపోలేదు.అసలే నియోజకవర్గానికి కొత్తయిన మంత్రి గంటా శ్రీనివాస్ ఈసారి విశాఖ నార్త్ లో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు, కాపుల మద్దతు తనకే ఉంటుందనని గంటా లెక్క లేసుకుంటున్నారు. మరోవైపు ఇద్దరు క్షత్రియ అభ్యర్ధుల మధ్య ఓట్ల చీలిక కూడా తనకు లాభిస్తుందని గంటా ఆశలు పెట్టుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చే పార్టీవైపే ఇక్కడి ఓటర్లు ఉంటారని గతానుభవాలు చెప్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ వైపే స్ధానిక ఓటర్లు మొగ్గు చూపే అవకాశముంది.విశాఖ పట్నం సిటీ పరిధిలోకి వచ్చే అర్బన్ నియోజకవర్గం కావడం, వ్యాపార, ఉద్యోగ వర్గాలు, విద్యావంతుల జనాభా అధికంగా ఉండటంతో బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు కూడా ఇక్కడ మరోసారి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్ ప్రకటించడం తమకు కలిసి వస్తుందని ఆయన చెప్తున్నారు.