హైద్రాబాద్, ఏప్రిల్ 12 (way2newstv.com)
నగరంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయక పోవడంతో నగర వాసులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజా రవాణాలో కీలకమైన బస్సుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతుంది. జనాభా పెరుగుతున్నా బస్సుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్ జనాభాకు 7,800 బస్సులు అవసరం ఉండగా 3,800 బస్సులతోనే ఆర్టీసీ అరకొర సేవలు అందిస్తోంది.నగరంలో కొత్త బస్సుల సంఖ్య భారీగా పెంచితే ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
సిటీలో కొత్త బస్సులు కావాలి...
నగరంలో దశలవారీగా మెట్రో కారిడార్లు అందుబాటులోకి వస్తు న్నా ఆర్టీసీ బస్సులపై పెద్దగా ప్రభావం పడడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సిన గ్రేటర్ ఆర్టీసీ నష్టాల కారణంగా పాత బస్సులతోనే సేవలు నెట్టుకొస్తోంది.నాలుగేళ్ల క్రితం ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 35 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 33 లక్షలకు తగ్గింది. ఓ వైపు నగరం విస్తరిస్తున్నా బస్సులు పెరగకపోవడంతో శివారు ప్రాంతాల్లో బస్సుల కొరత వెంటాడుతోంది. కొత్త బస్సులు రాక.. సిబ్బంది నియామకాలు లేకపోవడంతో గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది.గ్రేటర్ జోన్‌లో 3,810 బస్సులు ఉండగా వాటిలో ఏసీ 193, మెట్రో డీలక్స్ 166, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు 952, మినీ బస్సులు 100, ఆర్డినరీ బస్సులు 2,402 ఉన్నాయి. ఆర్డినరీ బస్సుల్లో 50 శాతం బస్సులు మార్చాల్సి ఉన్నా బస్సుల కొరతతో వాటినే రోడ్లపై తిప్పుతోంది గ్రేటర్ ఆర్టీసీ. ఇకనైనా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నారు.