ఈసీ తో మరో పేచి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈసీ తో మరో పేచి

విజయవాడ  ఏప్రిల్ 20, (way2newstv.com)
ఏపీ ప్రభుత్వం, ఈసీ మధ్య ఏదో ఒక విషయంపై వివాదం కొనసాగుతునే ఉంది. ఏపిలో అధికారులు న‌లిగిపోతున్నారు. ఒక వైపు ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌లు..మ‌రో వైపు స‌మీక్ష‌ల్లో ఎలా పాల్గొంటారంటూ ఎన్నిక‌ల సంఘం నోటీసులు. ఎన్నిక‌ల సంఘం..ముఖ్య‌మంత్రి మ‌ధ్య ఎవ‌రికీ స‌మాధానం చెప్పుకోలేక అధికారులు ఇబ్బంది ప‌డుతున్నారు. స‌మీక్ష‌ల పైన సీరియ‌స్ అయిన ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి నోటీసులు జారీ చేసింది. ఆయ‌న స‌మీక్ష‌ల్లో పాల్గొన్న అధికారుల నుండి వివ‌ర‌ణ కోరారు. సీఎం సమీక్షలపై ఈసీ అభ్యంతరం తెలిపింది. దీంతో ఏపీ సీఎస్ అధికారులకు నోటీసులు పంపించారు. ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడంలో తప్పేంటని అధికార టీడీపీ ప్రశ్నించగా, పెండింగ్ బిల్లుల కోసమే సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంది. 


ఈసీ తో మరో పేచి

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడ ఈసికి ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపై వైసీపీ ఫిర్యాదు చేయగా, ఎన్నికల కమిషన్ సీఎస్ వివరణ కోరింది. ముఖ్యమంత్రి ఏయే అంశాలపై సమీక్ష జరిపారు ? ఏఏ అధికారులు పాల్గొన్నారు ? ముందుగా అనుమతి తీసుకున్నారా ? లేదా అనే అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు పంపారు. సీఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులను వివరణ కోరారు. అరకొరగా మిగిలిన బిల్లుల్ని వసూలుకు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఎండలు, నీటి కటకటపై చంద్రబాబు సమీక్ష జరిపితే వైసీపీకి అభ్యంతరం లేదన్నారు. ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడంలో తప్పేంటని మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఎన్నికల సంఘం ఇపుడు సమీక్షల్ని అడ్డుకోవటం ద్వారా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఈసీ, ఏపీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వార్ మరింత ముదిరే అవకాశం ఉంది.