మచిలీపట్నం, ఏప్రిల్ 08 (way2newstv.com):
జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. నియోజకవర్గం దాటి అభ్యర్థులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సమయం లేదు మిత్రమా.. అంటూ పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని 16 నియోజకవర్గాలలో ప్రచారం ఒక ఎత్తయితే మంత్రులు తలపడే నియోజకవర్గాల్లో ప్రచారం ఒక ఎత్తుగా మారింది. చోటా నేతల కండువాలు రోజూ మారుతున్నాయి. గత అయిదేళ్లు మంత్రులుగా దర్పం ప్రదర్శించిన నేతలు ఇప్పుడు గ్రామాలు, వీధులు పట్టుకు తిరుగుతున్నారు. మైలవరం, బందరు, తిరువూరు నియోజకవర్గాల నుంచి మంత్రులు తెదేపా తరఫున బరిలో ఉన్నారు. బందరు నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొనగా... తిరువూరు, మైలవరాల్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ మైలవరం అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నికగా మారింది.మైలవరం నుంచి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆయన ఈ స్థానం నుంచి హ్యాట్రిక్ సాధించేందుకు తపన పడుతున్నారు. నియోజకవర్గంలో భారీగా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేశారు. వీటిపైనే ఆయన ఆశలు పెంచుకున్నారు. ఎన్నికల ముందు నుంచే ఇక్కడ ప్రచారం వేడెక్కింది. మంత్రిగా దేవినేని ఉమా నిత్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం.. వాటిని వైకాపా నేతలు తిప్పికొట్టడం నిత్యకృత్యమైంది.
ప్రచారహోరు (కృష్ణాజిల్లా)
దీంతో వైకాపాలో పట్టుదల పెరిగిందని, ఈసారి దేవినేని ఉమా ఓటమి చూడాలని జగన్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. వైకాపా నియోజకవర్గ ఇంఛార్జి జోగి రమేష్‌ను మార్చి పెడనకు పంపారు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దించారు. గతంలో నందిగామ నుంచి వీరిద్దరూ తలపడిన వారే. గత ఏడాదిగా వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరిన నుంచే ప్రచారం ప్రారంభించారని చెప్పవచ్చు. గడియారాలు పంపిణీ, చీరెల పంపిణీ, క్రికెట్ కిట్ల పంపిణీ వివాదాలు రేపాయి. పోలీసులను మచ్చిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రిగా దేవినేని ద్వితీయ శ్రేణి నాయకులకు భారీ ఎత్తున పనులు అప్పగించారు. ఇది కొంతమందిలో అసూయకు దారి తీసింది. మైలవరంలో నిరుపేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేశారు. మరోవైపు నేతలు సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల వైకాపా యువజన జిల్లా అధ్యక్షుడుగా కాజా రాజ్‌కుమార్ తెదేపాలో చేరారు. ఆయనకు మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో పట్టుంది. గత ఎన్నికల్లో తెదేపాకు మద్ధతు తెలిపిన జేష్ఠ రమేష్‌బాబు ఈ సారి వైకాపా వైపు దృష్టి సారించారు. నందిగామలో జగన్‌ను కలిసి వచ్చారు. ఈ నియోజకవర్గంలో మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో జడ్పీటీసీ సభ్యులు తెదేపాకు ఉన్నారు. జి.కొండూరు వైసీపీ చేతితో ఉంది. ఇబ్రహీంపట్నం ఎంపీపీ తెదేపాకు, జడ్పీటీసీ వైకాపాకు ఉంది. నియోజకవర్గంలో విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన జక్కంపూడి, గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, కొత్తూరు తాడేపల్లి పంచాయతీలు మైలవరం నియోజకవర్గంలో ఉన్నాయి. పట్టణ ప్రాంత ఓటర్లపై మంత్రి అధికంగా ఆశలు పెంచుకున్నారు. 2009, 2014లో వరుసగా మంత్రి గెలిచారు. ఈసారి ఇద్దరూ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నారు. జనసేన నుంచి రామ్మోహన్‌రావు బరిలో ఉన్నారు. ఈయన ఎవరి ఓట్లు చీల్చుతారనేది చర్చనీయాంశంగా మారింది.
బందరు నియోజకవర్గంలో త్రిముఖం నెలకొంది. తెదేపా తరపున మంత్రి కొల్లు రవీంద్ర పోటీలో ఉన్నారు. ఆయన రెండో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైకాపా నుంచి పేర్ని నాని మరోసారి తలపుడుతున్నారు. 2009లో ఓటమి పాలైన కొల్లు రవీంద్ర 2014లో గెలుపొందారు. సీఎం చంద్రబాబునాయుడుకు విశ్వాస పాత్రుడిగా మారారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. రెండు సార్లు పోర్టుపోలియోలు మార్చారు. అయితే నియోజకవర్గానికి పరిమితం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. బందరు పోర్టు ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడం, ముడా ఏర్పాటు కలిసివచ్చే అంశాలుగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. మత్స్యకార కుటుంబాల నుంచి మద్దతు పొందుతున్నారు. బందరు పురపాలక సంఘం, మండలం మాత్రమే ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇటీవల బూరగడ్డ రమేష్ తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఇక్కడ వైకాపా నుంచి పేర్నినాని పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన సామాజిక వర్గం ఓట్లపై ఆశలు పెంచుకున్నారు. జనసేన తరఫున బండి రామకృష్ణ అభ్యర్థిగా ఉన్నారు. ఒకప్పుడు హోటల్‌లో పనికి చేరిన ఆయన అధిపతిగా మారారు. విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన పార్టీలతో సమానంగా ప్రచారం సాగిస్తున్నారు. వైకాపా, జనసేన అభ్యర్ధులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ ఓట్లు చీల్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఇది ఎవరికి లాభిస్తుందనేది తేలాల్సి ఉంది. యవత జనసేన వెంట నడుస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో బందరులో ముక్కోణం ఆసక్తికంగా సాగుతోంది. పవన్‌కళ్యాణ్ ఇటీవల ఇక్కడ ప్రచారం నిర్వహించారు. జగన్, చంద్రబాబునాయుడు ఇక్కడ పర్యటించి శ్రేణులను ఉత్సాహపరిచారు.
మరో మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తిరువూరు నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ తెదేపా ప్రయోగానికి తెరతీసింది. ఈ స్థానం ఎట్టిపరిస్థితుల్లో దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. మరోసారి ఈ స్థానం నుంచి జెండా ఎగురవేసేందుకు వైకాపా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ద్విముఖ పోటీ నెలకొంది. తిరువూరు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో వైకాపా తరపున అభ్యర్థి రక్షణనిధి కేవలం 1676 ఓట్లతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓడిన తెదేపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే స్వామి దాసుకు టిక్కెట్ ఇవ్వలేదు. స్వామిదాసు భార్య సుధారాణి మాత్రం ప్రచారానికి రావడం లేదు. తిరువూరు మున్సిపాలిటీ, మండలం తెదేపా చేతిలో ఉన్నాయి. ఏ.కొండూరు జడ్పీటీసీ, విస్సన్నపేట ఎంపీపీ వైకాపా చేతిలో ఉన్నాయి. ఎ.కొండూరు ఎంపీపీ, గంపలగూడెం ఎంపీపీ, జడ్పీటీసీ, విస్సన్నపేట జడ్పీటీసీ పదవులను తెదేపా దక్కించుకుంది. ఎంపీ కేశినేని నాని చేసిన టాటా ట్రస్టు సేవలు అనుకూలం మారాయి. ఇక్కడ జనసేన మద్దతుతో పోటీచేసిన బీఎస్పీ అభ్యర్థి ఏ మేరకు ఓట్లను చీల్చుతారనేది ఆసక్తికరంగా మారింది.