అమరావతి ఏప్రిల్ 15 (way2newstv.com)
శాసనమండలి సభ్యునిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న తన కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్...మంత్రి యనమల రామకృష్ణుడు చేత ఎమ్మెల్సీగా సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. 2013లో ఎమ్మెల్సీగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బాధ్యతలు చేపట్టారు. గత నెల 31వ తేదీతో ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తయ్యింది. శాసనసభ్యుల కోటాలో మరోసారి మంత్రి యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రమాణస్వీకారం అనంతరం యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ...
‘స్పీకర్ గా శాసనసభలో రెడ్ లైన్ ఏర్పాటు చేసి, వెల్ లోకి వచ్చిన సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా సభ సజావుగా పనిచేసేటట్లు చేశాను. సభ్యులందరూ ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించేలా చట్టం చేశాను. న్యాయశాఖ మంత్రిగా తండ్రి ఆస్తిలో మహిళలకూ సగభాగం హక్కు కలిగేలా చట్టం తీసుకొచ్చాను. సహకార శాఖ మంత్రిగా సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చాను. ఇలా నా 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేపట్టిన ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు ఎంతో ఆత్మ సంతృప్తినిస్తున్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆనందం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్సీగా ఆర్ధికమంత్రి యనమల ప్రమాణస్వీకారం
చట్టసభల గౌరవం ఇనుమడింపజేసేలా అధికార, ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలపై తమ పోరాటం వల్లే కేంద్ర ఎన్నికల సంఘం తలొగ్గి, వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టిందన్నారు. రెండో పర్యాయం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన విలేకరులతో అసెంబ్లీ ఆవరణలో సోమవారం మాట్లాడారు. తనకో రెండో పర్యాయం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 1982లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. అలా 2009 వరకూ శాసనసభ సభ్యునిగా పనిచేసే అవకాశం ప్రజలు కల్పించారన్నారు. 2013లో ఎమ్మెల్సీగా మొదటిసారి సీఎం చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారన్నారు. గత నెల 31వ తేదీతో ఎమ్మెల్సీగా గడువు పూర్తయ్యిందన్నారు. మరోసారి తనపై నమ్మకం ఉంచిన సీఎ చంద్రబాబునాయుడు రెండో పర్యాయం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారన్నారు. 2025 వరకూ ఎమ్మెల్సీగా చట్టసభలో పనిచేసే అవకాశం లభ్యమైందన్నారు.