ఏలూరు, ఏప్రిల్ 1(way2newstv.com)
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం..టీడీపీ ఆవిర్భావం నుంచి సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రెస్ అయింది. ఇక్కడ నుంచి గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే 1983, 85లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994, 99లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్ విజయం సాధించగా రాష్ట్రం విడిపోయాక జరిగిన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు విజయం సాధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా ఉంగుటూరుని గెలుచుకుని రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సారి కూడా టీడీపీ నుంచి గన్ని పోటీ చేస్తుండగా..గత ఎన్నికల్లో గన్ని మీద ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి పుప్పాల శ్రీనివాసు (వాసుబాబు) బరిలో ఉన్నారు. జనసేన తరపున నవుడు వెంకటరమణ పోటీ చేస్తున్నారు. అయితే గత అయిదేళ్లు అధికారంలో ఉన్న గన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఆయన ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేశారు.ఇక పార్టీలకి అతీతంగా గన్నికి ఇక్కడ అభిమానులు ఉండటం ప్లస్. వివాదరహితుడుగా ఉన్న గన్ని గత యేడాది కాలంగా ప్రజల్లోనే ఉంటున్నారు.
గోదావరిలో ఎవరి ధీమా వారిదే
ఆయనపై వ్యక్తిగతంగాను, ఇతరత్రా పరంగాను మైనస్‌లు లేకపోయినా వైకాపా బలపడటం…జనసేన పోటీలో ఉండటం మైనస్. అటు వైకాపా అభ్యర్ధి వాసుబాబుకు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఉంది. దానికితోడు జగన్ పాదయాత్ర, టీడీపీ వైఫల్యాలు తనకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. కానీ అధికార టీడీపీ బలంగా ఉండటం..జనసేన ఓట్లు చీల్చే అవకాశం ఉండటం మైనస్. ఇక జనసేన నుంచి నవుడు వెంకటరమణ పోటీకి సై అంటున్నారు. కాపు ఓట్లు మీదే జనసేన ఆధారపడి ఉంది. గెలవడం సులువు కాదుకాని ఇతర పార్టీల గెలుపు అవకాశాలని దెబ్బ తీయొచ్చు.నియోజకవర్గంలో భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాలు ఉన్నాయి. ఉంగుటూరు మండలంలో టీడీపీ బలంగా ఉంది. నిడమర్రు మండలం గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీకి మైనస్సే… వైసీపీదే ఇక్కడ ఆధిక్యం. గణపవరం మండలంలో టీడీపీ, వైసీపీ హొరాహోరీ పోరులో టీడీపీకి స్వల్ప ఎడ్జ్ ఉంది. భీమడోలు మండలంలో మూడు పార్టీలకి బలం ఉంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో చూస్తే ఈ నియోజకవర్గంలో పునర్విభజన తర్వాత కాపు, బీసీ వర్గాల ఓటర్లు ప్రభావం ఎక్కువ. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ, జనసేనలు కూడా గట్టిగా ఉన్నాయి. దీంతో ఉంగుటూరులో ఈసారి ట్రైయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. జనసేన ప్రభావం నామమాత్రమే అయినా ఆ పార్టీ ఎఫెక్ట్ ఎవరికి పడుతుందో ? అంచనాకు రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఎవరు విజయం సాధించినా. ఎవరు ఓడినా వారు స్వల్ప ఆధిక్యతే ఉంటుంది.