అమ్మో కోవర్టులు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మో కోవర్టులు (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఏప్రిల్ 03 (way2newstv.com): 
ఎన్నికల సమరంలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇప్పుడు కోవర్టుల గుబులు పట్టుకొంది. సాధారణంగా ప్రచార ప్రణాళికలు, వివిధ వర్గాలతో సంప్రదింపులు, తాయిలాల పంపిణీకి సంబంధించిన సమాలోచనలన్నీ ముఖ్య నాయకుల మధ్య జరుగుతుంటాయి. ఇలాంటి సమావేశాల్లో చర్చించిన అంశాలు కూడా బయటకు పొక్కుతుండటంతో ప్రధాన పార్టీల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తమ వెన్నంటి ఉండే వారితో కూడా రహస్య సమాచారాన్ని పంచుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు విపక్షానికి సమాచారం చేరుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిప్రణాళికలను బయటకు చెప్పడానికి తటపటాయిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి గురించి వివరిస్తూనే ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎలాగైనా గెలుపు సాధించాలని కసరత్తు చేస్తున్నారు. ఇక్కడే కొంతమందిని కోవర్టుల సమస్య వెంటాడుతుంది. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను తాడేపల్లిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నరసాపురం, నిడదవోలు, గోపాలపురం వంటి నియోజకవర్గాల్లో కోవర్టుల సమస్య అధికంగా ఉన్నట్లు సమాచారం.


అమ్మో కోవర్టులు (పశ్చిమగోదావరి)

నాయకుల బలాబలాలు, ఆస్తులు, నగదు, మద్యం సమకూర్చడం, తాయిలాలు.. ఇలా అనేక అంశాలపై కోవర్టులు ఉప్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ప్రతి అంశమూ ఈసీ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బంది, తనిఖీ బృందాల కళ్లు గప్పి డబ్బు, మద్యం, తాయిలాలు క్షేత్రస్థాయికి చేర్చడానికి కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇలాంటి దశలో కోవర్టులు కీలకమైన సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు, తనిఖీ బృందాలకు చేరవేస్తే ఇబ్బంది పడతామన్న వాదన పలువురి నుంచి వినిపిస్తోంది. తనిఖీల మాటున ప్రత్యర్థిని దెబ్బతీయడం ద్వారా ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యేలా కోవర్టులు అడుగులు వేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రహస్య సమాచారాన్ని నాయకులు బయటకు చెప్పడానికి వెనకాడుతున్నారు. తమకు అత్యంత నమ్మకమైన వారి వద్ద మాత్రమే ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో స్వయంగా కార్యకలాపాలు పర్యవేక్షించుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
కొందరు అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో సొంతంగా ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామాల్లో అయితే గడ్డివాములు, మరుగుదొడ్లు వంటి ఎవరికీ అనుమానం కలగని ప్రదేశాల్లో, మండల ప్రధాన కేంద్రాల్లో భవనాలు, గదులను అద్దెకు తీసుకొని ప్రత్యేక కార్యాలయాల్లా మార్చుకుంటున్నారు. వాటిలో తమ పార్టీ ప్రచారానికి అవసరమైన సామగ్రితో పాటు ఎన్నికల వేళ ఓటర్లకు పంపిణీ చేసే సామగ్రిని నిల్వ చేసేందుకు వినియోగించుకుంటున్నారు. దీనికోసం రెండు నెలల అద్దెను ముందుగానే చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యాలయాల వద్దకు ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే అంశాలను తెలుసుకునేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని తమ చరవాణులకు అనుసంధానించుకొంటున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద నాయకులు, కార్యకర్తలను రహస్య కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు.