హైదరాబాద్ ఏప్రిల్ 26, (way2newstv.com)
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ హైదర్గూడ జనప్రియ అపార్టుమెంట్ లో ఆడుకుంటున్న ఓ చిన్నారి మృతి చెందాడు. అపార్ట్మెంట్లోని పార్కులో ఉన్న సిమెంట్ బల్ల విరిగిపోయి ఉంది. అది తెలియని చిన్నారి దిలిప్ శర్మ దానిపై కూర్చుని ముందుకూవెనుకకూ ఊయలలాగా ఊగుతుండగా ఉన్నట్టుండి ఆ సిమెంట్ బల్ల చిన్నారిపై పడింది. సిమెంట్ బల్ల బాలుడిపై పడటంతో చిన్నారి తలకు బలమైన గాయమైంది.
చిన్నారి ప్రాణం తీసిన అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం
సమీపంలో ఉన్న వారు పరుగున వెళ్లి సిమెంట్ బల్ల పక్కకు నెట్టి బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా అది విఫలయత్నం గానే మిగిలిపోయింది. అప్పటికే బాలుడు ప్రాణాలు వదిలాడు. మృతుడి తండ్రీ సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారు. విరిగిపోయిన సిమెంట్ బల్లే తన కుమారుడి మృతికి కారణమని మృతుడి తండ్రి ఆరోపించారు. కళ్ల ముందు ఆడుకుంటున్న కొడుకు నిర్జీవంగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.