సాధ్వికి..నల్లేరు మీద నడకేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సాధ్వికి..నల్లేరు మీద నడకేనా

భోపాల్, ఏప్రిల్ 27, (way2newstv.com)
దిగ్విజయ్ సింగ్… తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఆతర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కీలక పదవులు నిర్వహించిన నేత. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పనిచేసిన సీనియర్ నాయకుడు. గత పదిహేనేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. సుదీర్ఘకాలం తర్వాత భోపాల్ నుంచి లోక్ సభ బరిలో దిగారు. వాస్తవానికి ఆయనకు ఇది సొంత నియోజకవర్గం కాదు. కానీ ముఖ్యమంత్రిగా పాత పరిచయాలను దృష్టిలో ఉంచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.దిగ్విజయ్ సింగ్ పై బీజేపీ అనూహ్యంగా కరడుగట్టిన హిందుత్వ వాది, మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ను పోటీలోకి దించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక్కసారిగా అందరి దృష్టి మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకృతమైంది. 


సాధ్వికి..నల్లేరు మీద నడకేనా

ఏరికోరి ప్రత్యేకంగా ప్రజ్ఞాసింగ్ ను పోటికి దించడం వెనక ఆర్ఎస్ఎస్ బలమైన వ్యూహం దాగుంది. ఎలాగైనా దిగ్విజయ్ ను ఓడించాలన్నదే లక్ష్యం. 2007లో సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు పేలుళ్లు, ఆ తర్వాత మాలెగావ్ పేలుళ్లు సంభవించాక ఆర్ఎస్ఎస్, బీజేపీలపై దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. ఈ ఘటనను వెనక హిందూ టెర్రర్- కాషాయ ఉగ్రవాదం పాత్ర ఉందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాక 26/11 ముంబయి పేలుళ్లు, ఏటీఎస్ అధిపతి హేమంత్ కర్కరే ను కాల్చి చంపింది హిందుత్వ శక్తులేనని తీవ్రంగా ఆరోపించారు. దీంతో దిగ్విజయ్ సింగ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. దిగ్విజయ్ ను ఓడించడం ద్వారా అతనికి గుణపాఠం చెప్పలాన్నది లక్ష్యం. అదే సమయంలో ప్రజ్ఞాసింగ్ ను గెలిపించుకోవడం ద్వారా ఆమెపై గల ఉగ్రవాద ఆరోపణలను ప్రజలను తిరస్కరించారన్న అభిప్రాయం కలగచేయడమూ రెండో వ్యూహం. హిందుమతానికి ఉగ్రవాదాన్ని అంటగట్టి పార్టీని, హిందూ మతాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి దిగ్విజయ్ సింగ్ ప్రయత్నించారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ‘‘హిందు టెర్రర్’’ అనే పదాలను కోర్టులే తప్పుపట్టాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుర్తు చేస్తున్నారు.భోపాల్ నియోజజకవర్గ పరంగా చూస్తే మొత్తం ఓటర్లలో 69 శాతం హిందువులు, 26 శాతం మంది ముస్లింలు ఉన్నారు. మెజారిటీ హిందువులు మద్దతుతో విజయం సాధిస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ముస్లిం ఓట్లతో పాటు హిందువుల్లో చీలిక వల్ల తమకు లాభం చేకూరుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన దిగ్విజయ్ సింగ్ అప్రమత్తమయ్యారు. తాను హిందుత్వ వ్యతిరేకిని కాదని చెప్పడానికి పడరాని పాట్లు పడ్డారు. గుళ్లు, గోపురాలు , ఆలయాలను విస్తృతంగా సందర్శించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ యా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. మరోవైపు ఏటీఎస్ అధిపతి హేమంత్ కర్కరే పై సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఆరోపణలతో ఆమె, పార్టీ ఇరుకున పడ్డాయి. తన శాపం వల్లనే కర్కరే చనిపోయారని ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో తమకు ప్రమాదకరమని గ్రహించిన బీజేపీ రంగంలోకి దిగింది. సాధ్వీ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సాధ్వి కూడా కొంత వెనక్కు తగ్గింది. జైలులో తనను కర్కరే చిత్రహింసలు పెట్టారని, మహిళని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారని, దీంతో ఆయన సర్వనాశనమై పోతారని శపించానని సాధ్వి తెలిపారు. ఆమె అప్పట్లో అన్న నెల రోజుల తర్వాత కర్కరే కాల్పుల్లో చనిపోయారు. భావోద్వేగంతోనే తాను కర్కరే పట్ల అలా మాట్లాడానని సాధ్వి ఆ తర్వాత వివరణ ఇచ్చారు. క్షమాపణ చెప్పుకున్నారు. అయితే సాధ్వి వ్యాఖ్యల పట్ల దిగ్విజయ్ , రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.సాధ్వి అభ్యర్ధిత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమయింది. ఒకప్పుడు ఉమాభారతి ఇక్కడ గెలుపొందారు. ఈస్థానంపై మాజీ సీఎం బాబూలాల్ గౌర్, ఉమాశంకర్ గుప్తా ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రజ్ఞాసింగ్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉందని పార్టీ చెబుతోంది. ఆమె సామాజిక వర్గమైన ఠాకూర్ ఓటర్లు 4.50 లక్షల మంది ఉన్నారు. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గెలుపొందారు. ఆతర్వాత 1989 నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. అందువల్ల ఈసారి కూడా సాధ్వి విజయం తధ్యమని పార్టీ చెబుతోంది. కాంగ్రెస్ కూడా ధీమాగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో దిగ్విజయ్ సింగ్ ఆరు నెలల పాటు నర్మదానదీ తీరంలో రైతాంగం ప్రయోజనాల కోసం పాదయాత్ర నిర్వహించారు. సీనియర్ నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా విస్తృత పరిచయాలున్నాయి. గత ఏడాది అసెంబ్లీఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇవన్నీ తమను విజయతీరాలకు చేరుస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. అటు హస్తం, ఇటు కమలం ఎవరి ధీమాతో వారు ముందుకు వెళ్లారు. అంతిమంగా ఓటరు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.