విజయవాడ, ఏప్రిల్ 1(way2newstv.com)
వైసీపీ నుంచి విజయవాడ ఈస్ట్ లేదా మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తామన్నా కాదని టీడీపీ పంచన చేరిన వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ … ఇప్పుడు ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే కీలక సమయంలో కాపు జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఆయన పర్యటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వంగవీటి మోహన రంగా మరణం తర్వాత రాజకీయంగా ఆయన వారసత్వాన్ని కొనసాగించే విషయంలో చేసిన పొరబాట్లు వంగవీటి రాధాకృష్ణకు శాపంగా మారుతున్నాయా అంటే అవుననే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకృష్ణ... ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీ, ఇప్పుడు టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు తండ్రి రంగా రాష్ట్రస్ధాయి నాయకుడిగా, కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా ఉన్నప్పటికీ ఆయన వారసుడిగా తన సామాజికవర్గంతో పాటు విజయవాడ నగరంలోనూ అదే ఊపు కొనసాగించడంలో రాధా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంటుంది.
అడకత్తెరలో పోకచెక్కలాగా వంగవీటి
ఎన్నికలు, రాజకీయాలు, వర్గాల సంగతి ఎలా ఉన్నా... తనను నమ్ముకున్న ప్రజలను ఆదుకోవడంలో, వారిని ముందుండి నడిపించడంలో, భవిష్యత్తుపై భరోసా ఇవ్వడంలో రాధాకృష్ణ విఫలమయ్యారనే వాదన తరచూ వినిపిస్తుంటుంది. గతంలో కాంగ్రెస్ లో, తర్వాత ప్రజారాజ్యంలో, అనంతరం వైసీపీలో, చివరికి టీడీపీలో ఉన్నప్పటికీ తనకు బాగా పట్టున్న విజయవాడ నగరంలో సైతం తన హవాను కొనసాగించడంలో రాధా వైఫల్యం సుస్పష్టం. గత రెండు ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాలు, ఈసారి పార్టీ మారినా టికెట్ దొరకని పరిస్ధితి దీనికి తార్కాణంగా చెప్పవచ్చు.ఈసారి ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాధాకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సైతం సాహసం చేయలేకపోయింది. చివరి నిమిషం వరకూ ఊరించి స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చి సరిపెట్టింది. అలాగని కాపు సామాజికవర్గం జనాభా అధికంగా ఉన్న గోదావరి జిల్లాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో రాధాతో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో స్టార్ క్యాంపెయినర్ హోదాలో కొనసాగుతూనే టీడీపీలో పూర్తిస్ధాయిలో రాధా మమేకం కాలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. టికెట్ ఇవ్వలేకపోవడంతో ప్రచారంలో రాధా సేవల్ని వాడుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినా... చివరికి ఆయన్ను కొన్ని సీట్లకే పరిమితం చేయడం ద్వారా టీడీపీ తమ ఆలోచనను చెప్పకనే చెప్పింది.కొన్నేళ్లుగా నియోజకవర్గానికే పరిమితమవుతున్న రాధాకృష్ణను జిల్లాల్లో ప్రచారానికి తిప్పినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని టీడీపీ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే విజయవాడలో సైతం స్వయంగా చంద్రబాబు పాల్గొనే సభల్లోనూ రాధా జాడ కనిపించడం లేదు. దీనికి తోడు టీడీపీ అంటేనే గిట్టని ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు సైతం రాధాతో పాటు యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తిచూపడం లేదు. దీనికి తోడు ఆయన ప్రత్యర్ధి దేవినేని అవినాష్ కు గుడివాడ టికెట్ ఇచ్చి పూర్తిస్దాయిలో మద్దతు ఇస్తున్న టీడీపీ... తన విషయంలో మాత్రం ప్రచారానికి పరిమితం చేయడంపైనా రాధా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీతో ప్రచారంలో పాల్గొనలేక, అలాగని స్వయంగా పోటీ చేయలేక, ఇతర పార్టీల్లో చేరలేక రాధా పరిస్ధితి గందరగోళంగా మారిందని చెప్పవచ్చు