పెరిగిన ఓటింగ్...అందరిలో టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పెరిగిన ఓటింగ్...అందరిలో టెన్షన్

అనంతపురం, ఏప్రిల్ 20, (way2newstv.com
అనంతపురం జిల్లాలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి నష్టం చేకూర్చనుందనేది అంతు చిక్కడం లేదు. ఇరు పార్టీల నాయకులు విజయం తమది అంటే... తమదని చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ, వైసీపీ నాయకులు విజయంపై, ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలు తమకే వస్తాయంటూ లెక్కలేసి చెబుతున్నారు. అయితే ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఎవరు లాభం పొందనున్నారనేది అంచనా వేయం కొంత క్లిష్టంగా ఉంటోంది. వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేయడానికి రావడంతో తమకే మేలు కలుగుతుందనీ, సంక్షేమ ఫలాలు పొందినవారంతా ఓటేసేందుకు వచ్చారని తెదేపా వారు చెబుతున్నారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఇలా ఎక్కువ మంది ఓటేశారనీ, అది తమకు విజయాన్ని తెచ్చిపెడుతుందని వైకాపా వారు పేర్కొంటున్నారు.రెండు ప్రధాన పార్టీలు ఎవరికి వారు జిల్లాలో లెక్కలు వేసుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ఓటర్లు పోటెత్తారు. మొదటి ఫేజ్ 11వ తేదీ  జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరగగా, తొలుత ఈవీఎంల మొరాయింపులతో ఇబ్బందులు పడినా... ఆ తర్వాత రాత్రి వరకు చాలా చోట్ల పోలింగ్ నిర్వహించారు. 


పెరిగిన ఓటింగ్...అందరిలో టెన్షన్

మొత్తంగా ఎంత మేరకు పోలింగ్ జరిగిందనేది అధికారులు మరుసటిరోజు సాయంత్రం 5గంటల  తర్వాత లెక్కలు తేల్చారు. ఇందులో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కలిపి సగటున 82.22 శాతం పోలింగ్ జరిగినట్లు తేల్చారు. గత 2014 ఎన్నికల్లో 79.65 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి మాత్రం 2.57 శాతం అదనంగా పోలింగ్ పెరిగింది.జిల్లాలో 11వ తేదీ నిర్వహించిన పోలింగ్లో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ భారీ వరుసల్లో ఓటర్లు కనిపించారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ఆరంభించగా, అప్పటికే భారీ క్యూలైన్లలో ఓటర్లు వచ్చి నిల్చున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలాగే కనిపించింది. తర్వాత ఎంత వేడితో ఓటర్లు తగ్గినప్పటికీ సాయంత్రం 4 తర్వాత నుంచి మళ్లీ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా చోట్ల సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసేనాటికి ఎక్కువ మంది క్యూలైన్లలో ఉన్నారు. దీంతో వారందరికీ రాత్రి 11 గంటలైనా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11 తర్వాత కూడా పోలింగ్ జరగగా, కనగానపల్లె మండలం కోనాపురంలో మాత్రం దాదాపు ఒంటి గంట వరకు పోలింగ్ జరగడం విశేషం. మొత్తం జిల్లాలో ఎంత మేరకు పోలింగ్ జరిగిందనేది అధికారులు మరుసటిరోజు లెక్కలు వేశారు. అన్ని పోలింగ్ బూత్ల నుంచి మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు లెక్కించి చివరకు 82.22 శాతం పోలింగ్ జరిగినట్లు లెక్క తేల్చారు. దీంతో గత ఎన్నికల కంటే ఈసారి 2.57 శాతం పోలింగ్ పెరిగినట్లు తేలింది.
జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కటి మినహా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్శాతం పెరిగింది. రాప్తాడులో మాత్రం గత ఎన్నికల కంటే 1.55 శాతం పోలింగ్ తగ్గింది. ఇక్కడ గత ఎన్నికల్లో 83.87 శాతం పోలింగ్ జరగగా, ఈసారి మాత్రం 82.32 శాతం నమోదైంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అధికంగా, మరికొన్ని చోట్ల స్వల్పంగా ఓటింగ్ పెరిగింది. అత్యధికంగా కదిరి నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5.05 శాతం ఓటింగ్ పెరిగింది. ఆ తర్వాత మడకశిరలో 4.7 శాతం, పెనుకొండలో 4.01, పుట్టపర్తిలో 3.79 శాతం పోలింగ్ పెరిగింది. తక్కువ పెరుగుదల చూస్తే.. శింగనమలలో 0.74, ఉరవకొండలో 0.88, రాయదుర్గంలో 0.92 శాతం ఓటింగ్ పెరిగింది. ఇక అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలో గత ఎన్నికల కంటే 2.18 శాతం, హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో 2.89 శాతం ఓటింగ్ పెరిగింది.జిల్లాలో ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగగా, ఓటర్ల సంఖ్య కూడా అలాగే పెరిగింది. గత ఎన్నికల్లో జిల్లాలో 29,81,914 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అప్పట్లో 23,75,318 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఓటర్ల సంఖ్య 32,39,517 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు చివరకు ఖరారు చేశారు. ఇందులో 26,54,257 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 2.57 లక్షల మంది ఓట్లు పెరిగారు. అలాగే గత ఎన్నికల కంటే ఈసారి 2.78 లక్షల మంది ఎక్కువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 11వ తేదీ నిర్వహించిన పోలింగ్లో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ భారీ వరుసల్లో ఓటర్లు కనిపించారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ఆరంభించగా, అప్పటికే భారీ క్యూలైన్లలో నిలుసుకొని మరి ఓటు వినియోగించుకున్నారు.మరి ఈ ఓటు బ్యాంకు అంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపరో  తెలియాలంటే మే 23 వ తేదీ వరకు ఓపికపట్టక తప్పదు...