ఆలీ వర్సెస్ ప్రధ్వీరాజ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆలీ వర్సెస్ ప్రధ్వీరాజ్

గుంటూరు, ఏప్రిల్ 20, (way2newstv.com)
రాజకీయాల్లో నేతల మధ్య పోటీ ఉండటం సహజం. పదవుల్లో ఉన్న నేతల మధ్య మాత్రమే కాదు... పదవులు పొందాలని చూసే నేతల మధ్య అంతర్గతంగా పోటీ ఉంటుంది. పైకి కనిపించకపోయినా... నేతల మధ్య ఈ పోటీ అనే ఆయా పార్టీ నేతలకు మాత్రం తెలుస్తుంటుంది. తాజాగా వైసీపీలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న ఇద్దరు టాలీవుడ్ కమెడియన్ల మధ్య పోటీ కూడా ఇదే తరహాలో ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న అలీ, పృథ్వీల్లో కీలక పదవులు ఎవరికి దక్కుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో పృథ్వీ కంటే స్టార్ రేంజ్‌తో పాటు యాక్టర్‌గానూ అలీ చాలా సీనియర్. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే రాజకీయాలు, మరీ ముఖ్యంగా వైసీపీలో మాత్రం పృథ్వీతో పోలిస్తే అలీ జూనియర్ అనే చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చే విషయంలో కొంతకాలం డైలామాలో పడిపోయిన అలీ... మొదట టీడీపీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం వైసీపీలో చేరిపోయారు. 


ఆలీ వర్సెస్ ప్రధ్వీరాజ్

వైసీపీలో చేరే సమయంలోనే మంత్రి కావడం తన కల అని చెప్పుకున్న అలీ... జగన్ తనకు తగిన ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి తనపై విమర్శలు చేసిన దివ్యవాణి, పవన్ కళ్యాణ్ వంటివారిని తప్ప... టీడీపీ, జనసేన నేతలపై అలీ విమర్శలు గుప్పించిన దాఖలాలు లేవు. మరో నటుడు పృథ్వీ మాత్రం వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించారు. టీడీపీ, జనసేనపై తనదైన స్టయిల్లో విమర్శించి వైసీపీ అధినేత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అలీ, పృథ్వీ ఇద్దరూ వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి ఈ ఇద్దరూ ఆ పార్టీ తరపున నామినేటెడ్ పోస్టులనే ఆశిస్తున్నారు. తనకు మంత్రి కావాలని ఉందని ఓపెన్‌గానే చెప్పి అలీ కోరిక తీరాలంటే... ఆయనకు ముందుగా ఎమ్మెల్సీ పదవి దక్కాలి. ఒకవేళ జగన్ అలీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే... ఆయన మంత్రి పదవి ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక వైసీపీలో దూకుడుగా వ్యవహరిస్తున్న పృథ్వీ సైతం... పార్టీ అధికారంలోకి వస్తే తనకు కీలకమైన పదవి దక్కుతుందనే భావనతో ఉన్నట్టు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే అనేక అవకాశాలు ఉంటాయని... కాబట్టి ఇద్దరికీ పార్టీ తరపున మంచి పదవులు లభించే అవకాశం ఉందని కొందరు నాయకులు అబిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీలో కొనసాగుతున్న ఇద్దరు టాలీవుడ్ కమెడియన్లలో వైఎస్ జగన్ ఎవరికి ప్రయారిటీ ఇస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.