దాహం.. దాహం.. (తూర్పుగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దాహం.. దాహం.. (తూర్పుగోదావరి)

రాజమండ్రి, ఏప్రిల్ 22 (way2newstv.com): 
జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గోదావరి నదిలో నీటి నిల్వలు తగ్గిపోయాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రాజమహేంద్రవరం నగరంతో సహా ఇతర ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. జిల్లా వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏటా మూడు టీఎంసీల నీటిని కేటాయిస్తున్నా అవి సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాలం చెల్లిన పైపులైన్లు ఉండటంతో లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతోంది. వేసవి తీవ్రతకు తోడు ప్రస్తుతం తాగునీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు.జిల్లాలో రెండు నగరాలతో పాటు పట్టణాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. కాకినాడ నగరంలో దుమ్ములపేట, పర్లోవపేట, ముత్తానగర్‌, ఏటిమొగ, కుంతీదేవిపేట, ఎస్‌.అచ్యుతాపురం, స్వామినగర్‌, టీచర్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రాజమహేంద్రవరం గ్రామీణం శాటిలైట్‌ సిటీ, వాంబేకాలనీ, సుబ్బారావు నగర్‌, క్వారీ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా స్థానికుల అవసరాల మేరకు అందించలేక పోతున్నారు. వాంబే  కాలనీలో ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుండటంతో స్థాకులు సమీపంలోని రైతు నగర్‌కు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 


దాహం.. దాహం.. (తూర్పుగోదావరి)

రాజోలు మండలం కాట్రేనిపాడులంక, కొనమండ, కెనడం, మలికిపురం మండలంలోని పలు గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. అల్లవరం మండలం కొమరగిరిపట్నం, ఎస్‌.పల్లెపాలెం, సామంకుర్రు, డి.రావులపాలెం, దేవగుప్తం తదితర ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాట్రేనికోన మండలం పల్లం, బలుసుతిప్ప, కొల్లేటి మొగ, కొత్తపాలెం, గొల్లగరువు ప్రాంతాల్లో స్థానికులకు తాగునీరు సరిగా అందడం లేదు. ముమ్మిడివరం, కర్రివానిరేవు, మల్లయ్యపాలెం ప్రాంతాల్లో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గోకవరం మండలంలో కొత్తపల్లి, గోపవరం, కామరాజుపేట, తిరుమలయ్యపాలెం, మల్లవరం, అచ్చుతాపురం, తంటికొండ గ్రామాల్లో నీటి కోసం స్థానికులు ఇక్కట్లకు గురవుతున్నారు. కామరాజుపేట గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.ఈ ఏడాది మార్చిలో 106 చోట్ల భూగర్భ జలమట్టాల పరిస్థితిని సంబంధిత అధికారులు అంచనా వేశారు. 78 చోట్ల నీటి మట్టాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ప్రస్తుతం 480 ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 చోట్ల తాగునీటి చెరువులు ఉన్నాయి. కాలువల ద్వారా ఆ చెరువుల్లోకి నీటిని మళ్లించి అక్కడే శుద్ధి చేసి సరఫరా చేస్తుంటారు. ఈ చెరువులను 10 ఏళ్ల కిందట జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జనాభా పెరగడంతో వారికి తగిన విధంగా నీటిని అందించలేక పోతున్నాయి. కొత్తగా నీటి పథకాలు నిర్మిస్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిరుపయోగంగా మారడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.కాలువలకు నీటి విడుదల నిలిచిపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది. పలు ప్రాంతాల్లో తాగునీటి కోసం జనం తల్లడిల్లే పరిస్థితి ఉత్పన్నం కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు నింపినా పెరిగిన జనాభా దృష్ట్యా నీరు సరిపోయే పరిస్థితి లేదు. ప్రసుతం గోదావరిలోకి 6,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా 5,900 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు కాగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నీటి నిల్వలు పడిపోయాయి.