హైద్రాబాద్, ఏప్రిల్ 22, (way2newstv.com)
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభ వేగంగా పడిపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీకి ఇప్పుడు మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తయారైంది. తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టి ఆ పార్టీ స్థానంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఇంతకాలంలో కాంగ్రెస్ ను నేతలను టీఆర్ఎస్ చేర్చుకునేందుకు డోర్లు తెరిచి పెట్టేది. ఇప్పుడు బీజేపీ ఏకంగా రెడ్ కార్పెట్ పరిచింది. కచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ పట్టుదలగా ఉంది. టీఆర్ఎస్ అయితే ఏకంగా కాంగ్రెస్ ఉనికే రాష్ట్రలో ఉండవద్దు అన్నంత కసిగా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికలు మరో పరీక్షగా మారాయి.
టీ కాంగ్రెస్ కు కష్టకాలమే
19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచినా సగం మంది టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించేశారు. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వారు సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిపై అనుమానాలతో టీఆర్ఎస్, బీజేపీల్లో చేరిపోతున్నారు. ఈ సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నోకొన్ని స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి కొంత ఊరట లభిస్తుంది. పార్టీ పట్ల నేతల్లో, కార్యకర్తల్లో కొంత భరోసా ఉంటుంది. పార్టీ నాయకత్వంపై కూడా నమ్మకం ఏర్పడుతుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ విఫలమైతే మాత్రం పార్టీకి ముందుముందు మరింత కష్టకాలం రావడం ఖాయం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని పార్లమెంటు స్థానాలపై చాలానే ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్య నేతలుగా, రాష్ట్ర స్థాయి నేతలుగా ఉన్న వారు పోటీలో ఉండటంతో వారు పోటీ చేసిన స్థానాలైనా గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన నల్గొండ, మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోటీ చేసిన భువనగిరి, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేసిన మల్కాజ్ గిరి, సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసిన చేవెళ్ల, సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి బరిలో ఉన్న ఖమ్మం స్థానాలపై కాంగ్రెస్ కు ఎక్కువ ఆశలు ఉన్నాయి. వీటితో పాటు జహిరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో బలమైన పోటీ ఇచ్చామని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. వీటిల్లో కనీసం నాలుగైదు స్థానాలైనా గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ కు పునర్వైభవం ఖాయమని అంచనా వేసుకుంటుంన్నారు నేతలు. ఇక, ఇదే సమయంలో బీజేపీ ఎదుగుదల కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిగా మారింది. కనీసం ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుండే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరి, పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తాయో లేదా మరింత కీడు చేస్తాయో మే 23 వరకు వేచి చూడాలి.