సోషల్ మీడియా కొత్త ఒరవడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోషల్ మీడియా కొత్త ఒరవడి

వరంగల్, ఏప్రిల్ 10, (way2newstv.com)
ఈసారి ఎన్నికల్లో సోషల్‌ మీడియా క్రియాశీల పాత్ర పోషించింది. ముఖ్యంగా వాట్సాప్‌ ఎన్నికల ప్రచారానికి కొత్త కిక్కు ఇచ్చింది. అభ్యర్థులు నేరుగా చేసే ప్రచారం కంటే వాట్సాప్‌ ప్రచారం ఆకట్టుకుంది. శాసనసభ ఎన్నికలు ముగిసిన కేవలం మూడు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడంతో జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడే ప్రచారానికి ఆశించిన స్థాయి స్పందన రాకపోవడంతో కొంత ఆందోళనకు గురైన అభ్యర్థులు... ఈసారి స్పందన మరీ తక్కువగా ఉండటంతో మరింత డీలా పడాల్సి వచ్చింది. ప్రత్యక్ష ప్రచారం చేయలేని పనిని ఈసారి వాట్సాప్‌ చేసి చూపింది. ప్రధాని మోదీ ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ టాప్‌లోనే నిలిచారు. ఆయన సాధించిన విజయాలంటూ బీజేపీ నేతలు వాట్సాప్‌ వీడియోలతో ప్రచారం సాగించారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర స్థావరాలపై వైమానిక దళం చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియోలు హల్‌చల్‌ చేశాయి. ఎన్నికల్లో బీజేపీకి ఇది ప్రధాన అస్త్రంగా మారింది. దేశభక్తిని జోడిస్తూ ఈ ప్రచారం ఎక్కువ మందిని రీచ్‌ అయింది. ఇక ఎప్పటిలాగానే సెటైర్లతో సాగిన సీఎం కేసీఆర్‌ ప్రచారాల తాలూకు వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. 


సోషల్ మీడియా కొత్త ఒరవడి

ఈ విషయం లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో పోలిస్తే కాంగ్రెస్‌ కాస్త వెనుకబడింది. వాట్సాప్‌ ప్రచారంపై ఆ పార్టీ నేతలు అంతగా దృష్టి సారించినట్లు కనిపించలేదు. ఈసారి ప్యారాచూట్‌ నేతలు రాత్రికిరాత్రే టికెట్లు ఎగరేసుకుపోయారు. శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీని చెడామడ తిట్టిన నేతలు... లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి తిట్టిన పార్టీ నుంచే అభ్యర్థులుగా బరిలో నిలవడం గమనార్హం. పార్టీలు మారి టికెట్‌ పొందిన వారు గతంలోనూ ఉన్నా ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఈసారి కేవలం టికెట్‌ పొందడమే లక్ష్యంగా పార్టీలు మారి విజయం సాధించినవారున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని వాట్సాప్‌ ప్రచారం హోరెత్తింది. ఈ తరహా వీడియోలు వైరల్‌ అయ్యాయి.ఇక గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలోని నేతలు ఇప్పుడు ప్రచారంలో కొత్త హామీలు ఇవ్వటం కూడా ట్రోల్‌ అయిన వాటిల్లో టాప్‌ ప్లేస్‌లో నిలిచాయి. ఇక తనను గెలిపిస్తే ఏం చేస్తానో అభ్య ర్థులు చెప్పుకొనే ప్రచార వీడియోలు, ప్రత్యర్థి లోటుపాట్లు, ఆరోపణలు, కేసుల వివరాలు, సక్సెస్‌ స్టోరీలు, పార్టీ అధినేతల ప్రసంగాలు, మెనిఫెస్టో విశే షాలు... ఇలా వాట్సాప్‌ ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. ప్రచార ర్యాలీలను స్థానిక జనం పెద్దగా పట్టించుకోకపోతుండటంతో చాలామంది నేతలు వాటి వీడియోలను పొందుపరుస్తూ వాట్సాప్‌ గ్రూపులకు చేరేలా చేయటంలో విజయం సాధించారు. పార్టీల అధినేతలు ఏ రోజు ఎక్కడ ప్రచారానికి వస్తున్నారో తెలిపే షెడ్యూళ్లు కూడా వాట్సాప్‌లో బాగా చెక్కర్లు కొట్టాయి.