పార్లమెంట్ సమరం తర్వాత పరిషత్ ఎన్నికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్లమెంట్ సమరం తర్వాత పరిషత్ ఎన్నికలు

రంగారెడ్డి, ఏప్రిల్ 12 (way2newstv.com)
పార్లమెంట్ సమరం ముగియకముందే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలు పెట్టింది.ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ నిమిత్తం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నందున ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 400-600 ఓటర్లు ఓటుహక్కును వినియోగిచుకునేలా అధికారులు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈ నెలలోనే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పాలక వర్గాల పదవీకాలం జూలై 4, 5 తేదీలతో ముగియనున్నందున..ఈనెలలోనే షెడ్యూల్ విడుదల చేసి..వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నది. మే 23న పార్లమెంట్ ఫలితాలు వెల్లడి కానున్నందున జూన్ మొదటి వారంలో పరిషత్ ఫలితాలు వెల్లడించే కన్పిస్తున్నాయి. పాలకవర్గాల పదవీకాలం జులై వరకు ఉండడంతో జూన్‌లో ఫలితాలు వెల్లడించి..పదవీకాలం ముగిసేలోగా కొత్త పాలకవర్గాలను ఎన్నుకొని సిద్ధంగా ఉంచనున్నారు. ఇప్పటికే ఈసీ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి సిద్ధంగా ఉంచింది. 



 పార్లమెంట్ సమరం తర్వాత పరిషత్ ఎన్నికలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రిజర్వేషన్లు ఇది వరకే ఖరారయ్యాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు వేగం పెంచారు.గత నెల 27న గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ప్రచురించి, 30న మండల ప్రజాపరిషత్‌తోపాటు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ జాబితా ఆధారంగానే ఎంపీడీవోలతో పాటు ఇతర అధికారులతో ఆదివారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను సోమవారం సాయంత్రం ప్రచురించారు. ఈ పోలింగ్ కేంద్రాల ప్రక్రియ ఈనెల 20లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జిల్లా సీఈవోలు, జిల్లా సహాయ ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మండలాల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భవనాలను ఎంపీడీవోలు, ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి, అక్కడున్న పరిస్థితులు, పరిసరాలు, అనుకూలంగా ఉన్నాయా..? లేదా..? అనేది అంచనా వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఉమ్మడి జిల్లాలో 14,81, 295 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 7,51,162, మహిళలు 7,30, 084, ఇతరులు 49 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 జెడ్పీటీసీ స్థానాలు, 520 ఎంపీటీసీ స్థానాలుండగా 43 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులను ఎన్నిక చేయనున్నారు. వీటికి గాను ఉమ్మడి జిల్లాలో 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 527 ఉండగా, 400 నుంచి 600 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 2,457లను ఏర్పాటు చేశారు. ఇందులో రంగారెడ్డిలో 1,446, వికారాబాద్‌లో 1,247, మేడ్చల్ జిల్లాలో 291 చొప్పున పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.