అనంతపురం, ఏప్రిల్ 5 (way2newstv.com)
అనంతపురం జిల్లాలో ఉన్న హిందూపురం నియోజకవర్గం అంటేనే టీడీపీకి కంచుకోట... అసలు ఇక్కడ టీడీపీ ఓటమి అనే మాటే ఎరగదు. పార్టీ ఆవిర్భావం నుంచి..ఇతర పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసి పాగా వేయాలని చూసిన....ఇక్కడ ప్రజలు టీడీపీకే పట్టం కడుతూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలతో సహ... ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన వారందరినీ హిందూపురం ప్రజలు ఆదరించారు. ఇక గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ తొలిసారిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి నవీన్ నిశ్చల్‌పై 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి కూడా బాలయ్యనే మరోసారి బరిలోకి దిగున్నారు. అయితే వైసీపీ వ్యూహాత్మకంగా ముస్లిం ఓటు బ్యాంక్‌ని కొల్లగొట్టడానికి మాజీ ఐజీ ఇక్బాల్ అహ్మద్‌ను బరిలోకి దించింది. ఇక జనసేన తరుపున ఆకుల ఉమేశ్ పోటీ చేస్తున్నారు.టీడీపీకి బలమైన కేడర్ ఉండటం...బాలయ్య ఇమేజ్‌లే ప్రధాన బలాలు. అలాగే ఎన్నికల్లో గెలిచాక బాలకృష్ణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో తాగునీటి పైపులైన్, కూరగాయల మార్కెట్, రోడ్ల, వాటర్ ట్యాంకులు నిర్మాణాలు చేశారు. పింఛన్లు, పసుపు-కుంకుమ, రైతులకు పెట్టుబడి సాయం లాంటి అంశాలు బాలయ్య గెలుపుకి కలిసొచ్చే అంశాలు.
అనంతలో బాలయ్యకు తప్పని కష్టాలు
ఇక బాలయ్యకి ఉన్న అసలు మైనస్ పాయింట్...కార్యకర్తలని, అభిమానులని కొట్టడం, దురుసుగా మాట్లాడటం. వీటితో పాటు ప్రజలకు, నాయకులకు పెద్దగా అందుబాటులో లేకపోవడం.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలప్పుడే నియోజకవర్గానికి రావడం...నియోజకవర్గంపై పీఏల పెత్తనం ఉండటం లాంటివి బాలయ్యకి అతి పెద్ద మైనస్‌గా మారనున్నాయి.మరోవైపు బాలయ్యకి చెక్ పెట్టాలని వైసీపీ ముస్లిం అభ్యర్ధి, మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్‌ని పోటీ చేయిస్తుంది. కేవలం బాలయ్యపై ఉన్న వ్యతిరేకతే వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండటం, రెడ్డి సామాజికవర్గం కూడా వైసీపీ వైపే ఉండటం కొంత ప్లస్ కానున్నాయి. కానీ గత ఎన్నికల్లో పోటీ చేసిన నవీన్‌ని దూరంగా పెట్టి..తర్వాత టీడీపీ నేత అబ్దుల్ ఘనిని పార్టీలోకి తీసుకుని...ఆయనకి టికెట్ ఇవ్వకుండా రాజకీయాలకి కొత్త అయిన ఇక్బాల్‌కి ఇవ్వడం వైసీపీకి ప్రతికూలంగా మారనుంది. నియోజకవర్గంపై కొంత పట్టున్న నవీన్, అబ్దుల్ ఘనీ వర్గాలు పూర్తిగా సహకరించడం కష్టమే.ఇక ఇక్కడ జనసేన పోటీ నామమాత్రమే అని చెప్పొచ్చు. ఆ పార్టీ అభ్యర్ధి ఆకుల ఉమేశ్ పవన్ ఇమేజ్ మీద ఆధారపడాలి. దీంతో అసలు పోరు టీడీపీ-వైసీపీల మధ్యే ఉండనుంది. ఈ నియోజకవర్గంలో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ వాల్మీకీ, ముస్లిం, వైశ్యులు, రెడ్డి, ఎస్సీ వర్గాల ఓటర్లు కీలకం కానున్నారు. టీడీపీకి రెడ్డి సామాజికవర్గం తప్ప అన్నీ వర్గాల్లో బలం ఉంది. కానీ ఈ సారి పరిస్తితులు కొద్దిగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈసారి బాలయ్య విజయం అంత సులువు కాదు..ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకత వైసీపీని పోటీలో నిలిపింది. దీంతో ఇక్కడ హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి చూడాలి హిందూపురం ప్రజలు మళ్ళీ బాలయ్యనే గెలిపించుకుంటారో...సరికొత్తగా ఆలోచించి వైసీపీకి పట్టం కడుతారో చూడాలి.