గుంటూరు, ఏప్రిల్ 4 (way2newstv.com)
ఏపీలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. మరో ఐదు రోజుల్లో రాష్ట్రం ఎన్నికల గడప ముందు నిలబడనుంది. అంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ కూడా ప్రచారంలో దూసుకుపోవడమే కాదు.. ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కూడా వ స్తోంది. ఏది ఎలా ఉన్నా.. మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 9 సాయంత్రంతో ప్రచార గొంతులు మూగబోనున్నాయి. ఇక, ఇప్పటికే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు ప్రతిపక్షంగా మారుతారు అనే అంశంపై క్లారిటీ దాదాపు వచ్చేసి ఉండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అందునా.. మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే ఎవరు ప్రతిపక్షం, ఎవరు రంగంలోకి దిగుతారు? అనే విషయాలు స్పష్టంగా తెరమీదికి వచ్చాయి.4 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఏపీలో ఓటరు నాడి అందడం లేదు. మేధావులు, కొమ్ములు తిరిగాయని, దమ్ముందని చెప్పుకొనే మీడియా సంస్థలకు కూడా ఓటరు పల్స్ అందడం లేదు. ఎవరు ఎవరికి ఓటేస్తారు? అనే విషయంలో పెద్ద ఎత్తున సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధానంగా కనిపిస్తున్న విషయాలు రెండు. ఒకటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఒక త్రాసులోకి వచ్చేసింది. ఒకరిద్దరు తటస్థంగా ఉన్నా.. వారి ప్రభావం పెద్దగా ఉండదు.
ఎవ్వరికి అందని ఓటరు నాడి
ఇక, కమ్మ సామాజికవర్గం సంప్రదాయంగా ఉన్న పార్టీని బలపరుస్తున్నా.. వీరిలో ఎక్కువ మందికి తీవ్ర అసంతృప్తి వెంటాడుతోంది. సంప్రదాయ పార్టీకి జై కొడుతున్నా.. నిధుల సాయం చేస్తున్నా.. తీరా ఓటు విషయం వచ్చేసరికి మాత్రం జగన్‌కు వేసే పరిస్థితి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. మరోపక్క, నిన్న మొన్నటి వరకు అభివృద్ధిని పట్టుకుని వేలాడిన చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం పేరుతో ప్రజలకు వివిధ రూపాల్లో అధికారికంగానే నిధులు చేరేస్తున్నారు. పోలవరం ఊసు లేదు. అమరావతిమాట వినిపించడం లేదు. పైగా ఆయన అనుకూల మీడియాలో అప్రతిహత వార్తా విన్యాసం మరింత వేడెక్కుతోంది. మరోపక్క, ప్రధాన ప్రతి పక్షం నిన్న మొన్నటి వరకు సాగించిన పాదయాత్ర ఫలితం కనిపిస్తోందని అనుకుంటున్న సమయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పుట్టిముంచే పరిస్థితి తెచ్చాయి.ఇక, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని పదేపదే చెప్పిన జనసేనాని పవన్. దీనికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు వయోవృద్ధుడు అయిపోయాడు కనుక ఆయనను పక్కన పెట్టాలని పవన్ వ్యాఖ్యానించిన మాటలు ఇంకా ఏపీ ప్రజల స్మృతి పథం నుంచి చెరిగిపోలేదు. అయితే, అనూహ్యంగా పవన్ ఇప్పుడు చేస్తున్న కామెంట్లు, విపక్షం వైసీపీపై విరుచుకుపడుతున్న తీరు వంటివి ఆయనను ఎలా నమ్మాలి మిమ్మల్ని.. అనే ప్రశ్న దిశగా తీసుకు వెళ్తోంది. ఒకవైపు తానే సిఎం అవుతానని చెప్పాడు. చెబుతున్నాడు. మరోపక్క, తాను 25 ఏళ్లపాటు పోరాటం చేసేందుకు వచ్చానని, జగన్ మాదిరిగా తనకు వెంటనే సీఎం సీటు అక్కరలేదని అంటాడు.ఇలా.. ఒకపక్క టీడీపీ అభివృద్ధిని విడిచి సంక్షేమంపై కసరత్తు చేస్తోంది. అదేసమయంలో తమ ప్రాధాన్యాలు.. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన వృద్ధి వంటివాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన చంద్రబాబు దీనిని వదిలేసి.. జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఎవరు ఏంటనేది ప్రజలకు బాగా తెలుసు.. బొగ్గును చూపించి బంగారం అని పదేపదే చెప్పినంత మాత్రాన ఫలితం ఏముంటుంది? అనేది కీలక విషయం. ఇక, జగన్ కూడా తన ప్రాధాన్యాలు వివరించడంలోను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించడంలోనూ చాలా వెనుకబడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల నాడి పట్టుకునేందుకు మీడియా సహా ఇతర సర్వే సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఎవరి పక్షం ప్రజలు ఉన్నారనే విషయంలో క్లారిటీని ఇవ్వలేక పోతున్నాయి.నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అందరూ భావించారు. అదేసమయంలో ప్రతిపక్షం వైసీపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు మరోసారి ట్రెండ్ మారింది. ఇటు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అటు చంద్రబాబు గతంలో కేసీఆర్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పిన వ్యాఖ్యలను కూడా ఒకే సారి మననం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సమయం వచ్చే వరకు కూడా ఎవరికి ఓటేయాలనే విషయంపై తామే నిర్ణయం తీసుకోలేదని అంటున్న వారు కూడా పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు ఓటేసి గెలిపిస్తే.. ఆయన మళ్లీ సినీ ఫీల్డ్‌కు వెళ్లిపోతే.. తమ సమస్యల పరిస్థితి ఏంటి? తమను ఎవరు పట్టించుకుంటారు? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికిప్పుడు చెప్పాల్సి వస్తే.. జగన్‌కే ఒకింత ఎడ్జ్ కనిపిస్తోంది.