గుంటూరు, ఏప్రిల్ 25, (way2newstv.com)
ఈ వేసవి సీజన్‌లో విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే దీనిని తట్టుకునేందుకు సోలార్, విండ్ పవర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ప్రత్యామ్నాయాలు విద్యుత్ శాఖను ఆదుకుంటున్నాయి. లేదంటే విద్యుత్ కోత తప్పేటట్టు లేదని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం రోజుకు 70 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వాడకం ఉంటోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో 60 నుంచి 65 మిలియన్ యూనిట్ల మేర వాడకం ఉండేది. అటువంటిది ప్రతి ఏడాది కనీసం ఐదు నుంచి పది ఎంయూ వరకు పెరిగిపోతోంది. ఒకవైపు విపరీతంగా పెరుగుతున్న గృహ, వాణిజ్య విద్యుత్ సర్వీసులు, మరోపక్క ఎండల తీవ్రతతో ఏసీల వాడకం బాగా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉండే విద్యుత్ ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ వేసవి సీజన్‌లో కూడా తగినంత విద్యుత్‌ను సమకూర్చుకోగలిగామని, కోతల్లేని మెరుగైన, నాణ్యతతో కూడిన విద్యుత్‌ను అందివ్వగలుగుతున్నామని సంస్థ యాజమాన్యం చెబుతోంది.
ఏపీనీ ఆదుకుంటున్న సోలార్, విండ్ పవర్
అయితే గత రెండేళ్ళుగా పూర్తిస్థాయిలో సోలార్, విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వల్లే విద్యుత్ లోటు లేకుండా చేయగలుగుతోంది. ఇందులో సోలార్ పవర్ 2300 మిలియన్ యూనిట్ల వరకు ఉండగా, అదే విండ్ పవర్ 1700 మిలియన్ యూనిట్లగా నమోదవుతోంది. అంటే ఈ రెండింటి ద్వారానే నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. దీనిని రానున్న రోజుల్లో ఇంకా పెంచుకునేందుకు యాజమాన్యం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో సోలార్ పవర్ సాయంత్రం ఐదు గంటల వరకే ఉపయోగించే వీలుంటుంది. ఆ తరువాత సూర్యరశ్మి క్రమేపీ తగ్గుతున్నందున దీని ద్వారా సరఫరా సాధ్యపడటంలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీని సరఫరా నిలిచిపోయేసరికి విండ్ పవర్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఈ విధంగా ప్రధానమైన సోలార్, విండ్ ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురాగలగుతున్నట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఉండే ఐదు జిల్లాలకు సంబంధించి గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన విద్యుత్ సర్వీసులకు ఏకంగా 59 లక్షలకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది కనీసం 80 నుంచి లక్ష వరకు పెరుగుతున్నాయి.ఇందులో హెచ్‌టీ (పరిశ్రమలు), వ్యవసాయం, గృహ, వాణిజ్యపరమైన సర్వీసులుంటున్నాయి. కాగా గత ఏడాది మే 30వ తేదీన ఈపీడీసీఎల్ పరిధిలో 33.59 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వాడకం చేరుకుంది. ప్రస్తుతం ఎండల తీవ్రతనుబట్టి ఆయా రోజుల్లో 32నుంచి 33 మిలియన్ యూనిట్ల వరకు వెళ్తుంది. దాదాపుగా రెండు మాసాల వరకు ఎండల తీవ్రత ఉన్నందున వాడకం అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయని, ఈ క్రమంలో దాదాపుగా రెండు మాసాల వరకు అవసరమైనంత విద్యుత్‌ను సోలార్, విండ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని అధికారి పేర్కొన్నారు.