సీఎల్పీలో టీఆర్ఎస్ లో విలీనమేనా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఎల్పీలో టీఆర్ఎస్ లో విలీనమేనా...

హైద్రాబాద్, ఏప్రిల్ 22, (way2newstv.com)
కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనానికి రంగం సిద్ధమైందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందుకు సమయత్తమవుతున్నారా? అన్న ప్రశ్నకు అవుననే అంటున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇంకెవరూ పార్టీ మారే పరిస్థితి లేదని లీకులిస్తున్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతల పరస్పర ప్రకటనలతో మరోసారి విలీనాంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతున్నట్టు ఆ వర్గాలు అంటున్నాయి. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా స్పీకర్‌కు లేఖ ఇచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే విలీన పక్రియ పూర్తి చేయాలని గులాబీ బాస్‌ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీగూటికి చేరుతున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. 


సీఎల్పీలో టీఆర్ఎస్ లో విలీనమేనా...

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం కారెక్కుతారనే ప్రచారం కూడా సాగుతున్నది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు ఇవ్వనున్నారు. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హౌదాను గల్లంతు చేసేందుకు టీఆర్‌ఎస్‌ అడుగులేస్తున్నట్టు ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. టీఆర్‌ఎస్‌ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే...ప్రతిపక్ష హోదా ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మండలిలో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు సంతకాలు చేసి మండలి చైర్మెన్‌కు లేఖ ఇవ్వగానే... టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 13 మంది ఎమ్మెల్యేలు టీడీఎల్పీని, టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌ లేఖ ఇచ్చారు. వెంటనే స్పీకర్‌ విలీనం నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సీఎల్పీ విషయంలో అదే జరగబోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. అందులోనూ ముగ్గురు కూడా వారిబాటలో నడిచే అవకాశం ఉన్నదని కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. వచ్చే శాసనసభ సమావేశాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే కనిపిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు పార్టీ మారడం పట్ల సీఎల్పీ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇంకెవరూ పార్టీని వీడే పరిస్థితి లేదని, తాను పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను గండ్ర ఖండించారు.