తెలంగాణలో ఈ బీట్ సిస్టమ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో ఈ బీట్ సిస్టమ్

నిజామాబాద్, ఏప్రిల్2, (way2newstv.com)
నేరాలను అదుపుచేయడంలో జిల్లా పోలీసులు ముందుంటున్నారు. పోలీసు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుక రాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా వాసులు తమ సమస్యలతోపాటు తెలిసిన సమాచారాన్ని వాట్సాప్‌కు చేరవేస్తున్నారు. ఈ బీట్ విధానంలో గస్తీ నిర్వహిస్తుండడంతో దొంగతనాలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. నేరాల శాతం తగ్గుముఖం పట్టింది. సైబర్ నేరాలపై పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మోసపోకుండా అవగాహన కార్యక్రమాలను చేపట్టి చైతన్య వంతులను చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ మోసాలు పూర్తిగా నివారించగలుగుతున్నారు. పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడేవారు. జిల్లా పోలీసుశాఖ వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తేవడంతో ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు.


తెలంగాణలో ఈ బీట్  సిస్టమ్

వాట్సాప్ నంబర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పోలీసు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ నంబర్ ప్రజలకు చేరువైంది. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఆయా ప్రదేశాల్లో ఓ రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి ఆ రిజిస్టర్‌లో విధులు నిర్వహించినట్లు సంతకాలు చేసేవారు. కొంత మంది పోలీసులు గస్తీకి వెళ్లకుండానే ఉదయం వెళ్లి రిజిస్టర్‌లో సంతకాలు చేసే వారని ఆరోపణలు ఉండేవి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా  ఈబీట్ సిస్టంను ఎస్పీ అందుబాటులోకి తీసుకొచ్చారు. గస్తీ నిర్వహించే పోలీసులకు సెల్‌ఫోన్లను అందజేశారు. రాత్రి వేళల్లో గస్తీకి వెళ్లే ముందు పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు సెల్‌ఫోన్ కెమెరాను ఆన్ చేసి దారి గుండా, బీట్ ప్రదేశం వరకు రికార్డింగ్ చేసి వాట్సాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా ఉన్న వారిని ఈ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారు. బ్యాంకులు, ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారి ఇళ్ల వద్ద ప్రత్యేకంగా నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను ఆరా తీసి వివరాలను తెలుసుకుంటున్నారు. గంటగంటకు వాట్సాప్‌లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఉదయం 5గంటల నుంచే డీఎస్పీ ఈ బీట్ ద్వారా విధులు నిర్వహిస్తున్న పోలీసుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఇలా ఈ బీట్ సిస్టం ద్వారా ఆర్థిక నేరాలు తగ్గుముఖం పట్టాయి. మూడు నెలల క్రితం 23 ఆర్థిక నేరాల కేసులు నమోదు అయ్యాయి. ఈ బీట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనవరి నుంచి మార్చి 24 వరకు నాలుగు ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి.