ఓటేసే ప్రతి మహిళకు ‘సానిటరీ న్యాప్ కిన్లు’
ముంబాయ్ ఏప్రిల్ 25 (way2newstv.com)
ఎన్నికల వేళ ఎన్నికల సంఘం మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ఓటేసే మహిళలకు ఓ గిఫ్ట్ ను ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.‘సఖి మత్ దాన్ కేంద్రాస్’ అనే పథకం కింద ముంబై నగర పరిధిలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 29న ఓటు వేసే మహిళలందరికీ సానిటరీ న్యాప్ కిన్లు అందజేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నికల సంఘం బంపర్ ఆఫర్!
ఎన్నికల్లో మహిళా ఓటర్లను మరింత పెంచడానికి.. మురికివాడల్లోని మహిళలను ఆదుకునేందుకు .. ప్రజాస్వామ్యంలో మహిళలను భాగస్వాములను చేయడానికే ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ఈసీ అధికారులు తెలిపారు.ప్రస్తుతం ముంబై నగరంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ న్యాప్ కిన్ల పంపిణీ చేస్తామని.. దీంతోపాటు కుర్లా - అంధేరి బోరివిల్లి లాంటి సబ్ డివిజన్లలో కూడా న్యాప్ కిన్లు పంపిణీచేస్తామని అధికారులు తెలిపారు.ఈ పోటింగ్ కేంద్రాల్లో మొత్తం మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని.. వాళ్లే ఓటేసిన ప్రతి మహిళకు సానిటరీ న్యాప్ కిన్ ప్యాకెట్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.