కాంట్రాక్టర్ ఇసుకను అమ్మేసుకుంటున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంట్రాక్టర్ ఇసుకను అమ్మేసుకుంటున్నారు

హైద్రాబాద్, ఏప్రిల్ 13,(way2newstv.com)
ఇసుక మాటున కోట్లాది రూపాయల వ్యాపారం..కనిపిస్తే చాలు లారీల కొద్ది ఎత్తుకపోవడం, ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా జేబులు నింపుకుంటున్నారు. గుట్టలుగా మిగిలిన ఇసుకను సదరు కాంట్రాక్టర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరకు విక్రయించాడు.ట్రాక్టర్ల కొద్దీ ఇసుకను ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఎట్టకేలకు బంట్వారం పోలీసులు అక్రమంగా రెండు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా ఇటీవల పట్టుకుని ట్రాక్టర్లను సీజ్ చేశారు. అభివృద్ధి పనుల పేరిట తక్కువ ధరకు తెచ్చుకున్న ఇసుకను ప్రభుత్వ పనులకే వినియోగించాలి తప్పా ప్రైవేటు వ్యక్తులకు ఎలా అమ్ముకుంటారని స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టన్ను ఇసుక రూ.600లకు లభించగా...ప్రస్తుతం రూ.1500 పలుకుతోంది. దీనికి కారణం అక్రమంగా ఇసుక తరలిపోవడమేనని పలువురు పేర్కొంటున్నారు.మిషన్ కాకతీయ, ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక అవసరం ఉంటే సంబంధిత అధికారుల వద్ద అనుమతి పొందాలను సర్కారు నిబంధనలు పెట్టింది. 


కాంట్రాక్టర్ ఇసుకను  అమ్మేసుకుంటున్నారు

దీంతో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ పనులకు కాంట్రాక్టర్లు అనుమతులు తీసుకొని ఇసుక తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మిషన్ పనుల సాకుతో కాంట్రాక్టర్ అవసరానికి మించి ఇసుకను కొనుగోలు చేశాడు.పనులు పూర్తయ్యాక మిగిలిన ఇసుకను ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించి మరో దందా షురూ చేస్తున్నారు. బంట్వారం మండలం నాగసన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న కొర్రివాగు న్యూ ట్యాంకు చెక్‌వాల్ నిర్మాణానికి ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద రూ.3.17 కోట్లు విడుదల చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ యాలాలలోని కాగ్నా, కాక్రవేణి నదుల ఇసుక రీచ్‌ల నుంచి అనుమతి పొంది అవసరానికి మించి ఇసుకను ప్రభుత్వ ధరకు కొనుగోలు చేశాడు. నాగసన్‌పల్లి కొర్రివాగు చెక్‌వాల్ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. మరో వైపు తమ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, వెంటనే పట్టుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఎస్సై రమణారెడ్డి తెలిపారు. వెంటనే తనిఖీలు నిర్వహించగా..నాగసన్‌పల్లి నుంచి బార్వాద్ వైపు రెండు ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండగా, వాటిని అడ్డగించి పట్టుకున్నాం.వివరాలు అడుగగా, వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. ఎక్కడి నుంచి ఇసుకను తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తే..నాగసన్‌పల్లి కొర్రివాగు చెక్‌వాల్ పనుల వద్ద మిగిలిన ఇసుకను సంబంధిత కాంట్రాక్టర్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు ట్రాక్టర్ యజమానులు తెలిపారు. దీంతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి రెండు ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు.