కోల్ కత్తా, ఏప్రిల్ 29 (way2newstv.com)
సాధారణ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సోమవారం దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో ముగిసింది. ఈ విడతలో పశ్చిమ్ బెంగాల్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పశ్చిమ్ బెంగాల్‌లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకుంది. మొదటి మూడు విడతల్లోనూ పశ్చిమ్ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా, అనసోల్ పార్లమెంటు పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్దే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఇదే ప్రాంతంలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కారుపై కొందరు దాడి చేశారు.
నాలుగో దశ పోలింగ్ హింసాత్మకం
ఆసన్‌సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద భద్రతాసిబ్బందితో తృణమూల్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కేంద్ర బలగాలు లేకుండానే పోలింగ్ ఎలా నిర్వహిస్తారని తృణమూల్ కార్యకర్తలు నిలదీశారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు జోక్యం చేసుకోవడంతో వివాదం నెలకుంది. దీంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపైఒకరు దాడి చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు.ఇదే పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కారుపై దాడి చేశారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన బాబుల్ సుప్రియోను కొందరు ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ‘పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను అడ్డుకుంటున్నారని సమాచారం రావడంతో నేను ఇక్కడకు వచ్చాను. అప్పుడే కొందరు నా కారుపై దాడి చేశారు’ అని సుప్రియో తెలిపారు. దీనిపై ట్విట్టర్‌లో బాబుల్ సుప్రియో తెలిపారు... ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీకి చెందిన కార్యకర్తలు హింస, క్రూరమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు.. రాణి గంజ్ మేయర్ జితేందర్ తివారీ అనసోల్ పరిధిలోని దమరాలో 169, 113, 218 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను బయటకు పంపించేశారు. చిత్తరంజన్‌లోని 20,21,22,35,36 పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్లను కూడా బయటకు వెళ్లగొట్టారు’