వేసపి ముప్పు (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వేసపి ముప్పు (అనంతపురం)

అనంతపురం, ఏప్రిల్ 22  (way2newstv.com): 
గతేడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు జిల్లాలో తాగునీటి అవసరాలపై తీవ్రస్థాయిలో చూపుతున్నాయి. ఓ వైపు భూగర్భ జలాలు క్రమంగా దిగువకు చేరుతున్నాయి. జూన్‌ ఆరంభంలో నైరుతి రుతు పవనాల రూపంలో వర్షాలు కురవాల్సి ఉంది. అయితే అప్పటి వరకు భూగర్భ జలాలు మరింత కిందకు చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు తాగునీటి ఇక్కట్లు పడుతున్న గ్రామాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఓవైపు ఎండలు మండిపోతుంటే... జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణులు గుక్కెడు నీటి కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో నీటి పథకాలకు తాగునీరు అందించే బోర్లు అడుగంటుతున్నాయి. చేతి బోర్లు సైతం నీరు అందక మూలకు చేరుతున్నాయి. వీటన్నింటికీ కారణం... జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు క్రమంగా దిగువకు చేరుతుండటమే. గత ఏడాదితో పోలిస్తే కొన్ని మీటర్ల మేర భూగర్భ జలం దిగువకు చేరుతోంది. గత ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఖరీఫ్‌, రబీలో సైతం వర్షాలు ముఖం చాటేశాయి. ఖరీఫ్‌లో అడపా దడపా అక్కడక్కడ వర్షాలు కురిసినా... రబీలో చినుకు జాడే లేకుండా పోవడం.. ఈ వేసవిలో ప్రభావం చూపుతోంది. 


వేసపి ముప్పు (అనంతపురం)

జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ 15 నాటికి భూగర్భ జలం సగటున 19.71 మీటర్ల మేరకు ఉంది. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 25.4 మీటర్లకు చేరింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 5.69 మీటర్ల మేర దిగువకు గంగమ్మ వెళ్లింది. తాగునీటి అవసరాల కోసం నీటిని మరింత వినియోగించనున్న నేపథ్యంలో మరింత కిందకు భూగర్భ జలం చేరే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా గాండ్లపెంటలో 89.27 మీటర్ల దిగువకు భూగర్భ జలం చేరింది. ఆ తర్వాత స్థానాల్లో లేపాక్షి మండలం పూలమతిలో 77.03 మీటర్లు, మడకశిర మండలం ఆర్‌.అనంతపురంలో 73.24, తలుపులలో 70.03, యాడికి మండలం నాగరూరులో 67.855, బుక్కపట్నం మండలం పి.కొత్తకోటలో 66.23, గుడిబండ మండలం మొరబాగల్‌లో 66.16, గోరంట్ల మండలం పులగూర్లపల్లెలో 63.81, ములకన్మూరులో 60.202 మీటర్ల దిగువున భూగర్భ జలం అందుబాటులో ఉంది. జిల్లా వ్యాప్తంగా కేవలం 1.4 శాతం మాత్రమే 3 మీటర్లకుపైన భూగర్భ జలం ఉండగా, 3 నుంచి 8 మీటర్లలోపు 7.8 శాతం మేరకు ఉంది. ఇక మిగిలిన 90.8 శాతం ప్రాంతంలో 8 మీరట్ల కంటే దిగువనే ఉండటం విశేషం.గత ఏడాది వర్షాభావ ప్రభావం, భూగర్భ జలాలు అడుగంటున్న తరుణంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమవుతోంది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి తాగునీటి పథకం, జేసీ నాగిరెడ్డి పథకం వంటి పెద్దపెద్ద పథకాల ద్వారా నీటిని అందిస్తున్నప్పటికీ ఇంకా తాగునీరు కోసం నిత్యం అవస్థలు పడుతున్న పల్లెలు చాలా ఉన్నాయి. వీటి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 430 గ్రామాల్లో తాగునీరు అందుబాటులో లేదు. ముఖ్యంగా పెనుకొండ, మడకశిర, కదిరి నియోజకవర్గాల పరిధిలోని ఈ సమస్య అధికంగా ఉంది. తలుపుల మండలంలో ఏకంగా 73 పల్లెలు, రొళ్లలో 47, తనకల్లులో 34, పెనుకొండలో 32, నల్లమాడ, ఓడీసీ, చిలమత్తూరు మండలాల్లో 21 పల్లెలు చొప్పున, మడకశిరలో 20, ఎన్పీ కుంట, ధర్మవరంలో 16, పుట్లూరులో 15, అమడగూరులో 14, గోరంట్లలో 11 పల్లెల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది.మొత్తం 430 గ్రామాలకు 1787 ట్రిపుల మేర ట్యాంకర్ల ద్వారా గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ తాగునీటిని సరఫరా చేస్తోంది. గత ఏడాది ఈ సమయానికి కేవలం 50 గ్రామాల్లో మాత్రమే ఇలా తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారని ఆశాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు పది రెట్లు పెరిగింది.వచ్చే నెల నాటికి జిల్లాలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న గ్రామాల సంఖ్య గరిష్ఠంగా 600 వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.