డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్

నల్గొండ, ఏప్రిల్ 25, (way2newstv.com)
వేసవి ఎండల తీవ్రతతో పెరుగుతున్న ఊష్ణోగ్రతలు, వేగంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలతో రిజర్వాయర్లు, చెరువులు, బోర్లు, బావుల్లో నీటి నిల్వలు తరిగిపోయి తాగునీటి సమస్యలు జటిలమవుతున్నాయి. ఏడాదికాలం నుంచి సాధారణం కంటే తక్కువ వర్ష్షపాతం నమోదవ్వడంతో ఈ ఏడాది చెరువులు, రిజర్వాయర్‌లు త్వరగా అడుగంటిపోయాయి. రాష్ట్రంలోని అతి తక్కువ వర్షపాత జిల్లాల్లో నల్లగొండ నాల్గవ స్థానంలో ఉండగా, భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్న రాష్ట్రంలోని 51 మండలాల్లో 19 మండలాలు ఈ జిల్లా పరిధిలోనే ఉండటం తాగు, సాగు నీటి సమస్యలను చాటుతోంది. భూగర్భ జలాలు గత ఏడాది మార్చితో పోల్చితే నల్లగొండ జిల్లాలో 2.46 మీటర్లు దిగువకు పడిపోగా, సూర్యాపేట జిల్లాలో 1.0మీటర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.41 మీటర్లు దిగువకు పడిపోయాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కరువు ప్రాంతాలైన దేవరకొండ డివిజన్ మండలాలు దేవరకొండ, చందంపేట, నేరడుగొమ్ము, పిఏపల్లి, చింతపల్లి, డిండి, గుర్రంపోడుతో పాటు చండూర్, మునుగోడు, చౌటుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో తాగునీటీ ఎద్దడి సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నెలతో పోల్చితే మరో 2మీటర్లకు పైగా భూగర్భ జలమట్టం తగ్గిపోవడం ఆందోళనకరంగా కనిపిస్తుంది.


డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్

భువనగిరి డివిజన్‌లోని తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటాకొండూరు, అడ్డగూడూరు, గుండాల, మోత్కూర్, వలిగొండ మండలాల్లో సైతం భూగర్భజలాల కొరతతో తాగునీటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అద్దె బోర్లతో, ట్యాంకర్లతో నీటి సరఫరా ప్రయత్నాలు చేస్తున్నా వాటికి తగిన నిధులు ప్రభుత్వం నుండి సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లు, ప్రైవేటుగా మంచినీటీ సేకరణతో తంటాలు పడుతున్నారు.నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో రబీ సాగునీటి అవసరాలకు, వేసవిలో పెరిగిన తాగునీటి అవసరాలకు నీటి విడుదల సాగుతున్న నేపధ్యంలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. సాగర్ ప్రాజెక్టులో కనీస నీటి మట్టం (డెడ్ స్టోరేజీ) 510 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 512.80 అడుగులుగా ఉంది. మరో 2.80 అడుగుల నీరు మాత్రమే సాగర్‌లో తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్నాయి. ఎడమకాలువకు ఆదివారం నుండి నీటీ విడుదల నిలిపివేయగా, ఏపికి కేటాయించిన ఆరు టీఎంసీల నీటి విడుదల మేరకు 6,853క్యూసెక్కుల విడుదల సాగుతుండగా మరో రెండు రోజులు కొనసాగనుంది. జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా తాగునీటీ అవసరాల కోసం ఏఎమ్మార్పీ ప్రాజెక్టుకు 1800క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారం రోజుల్లో సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా తాగునీటీ అవసరాల కోసం గతంలో కనీసనీటి మట్టానికి దిగువన కూడా రాష్ట్ర ప్రభుత్వం నీటీని విడుదల చేసుకున్న నేపధ్యం తాగునీటి సమస్యల పరిష్కారం దిశగా కొంత భరోసానిస్తుంది. అయితే సాగర్ కాలువలు, చెరువుల పరిధిలోని మండలాలకు మాత్రం ఈ మేరకు తాగునీటీ సమస్యలు అధిగమించే అవకాశమున్నా సరైన వర్షాలు లేని పక్షంలో దేవరకొండ, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ డివిజన్‌ల పరిధిలోని మండలాల్లో మాత్రం రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు మరింత తీవ్రతరం కావడం తధ్యంగా కనిపిస్తుంది.