తెలంగాణ ఫైర్ బ్రాండ్ కు కలిసొచ్చేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ ఫైర్ బ్రాండ్ కు కలిసొచ్చేనా

హైద్రాబాద్, ఏప్రిల్ 2 (way2newstv.com)
కొంతమంది రాజకీయ నేతలు మాట్లాడితే... ఆ ప్రసంగం ఆసక్తికరంగా సాగుతుంది. చప్పగా మాట్లాడకుండా... పవర్ పంచులతో విరుచుకుపడతారు. ప్రత్యర్థుల్ని మాటలతోనే వెంటాడి, వేటాడతారు. అలాంటి వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు ఈ కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం ఈయ‌న పేరు వింటేనే అధికార టీఆర్ఎస్ పార్టీకి కోపం న‌షాలానికి ఎక్కుతుంది. ఎందుకంటే అసెంబ్లీలోగానీ, ఎన్నికల ప్రచారంలోగానీ, ప్రెస్‌మీట్లు పెట్టినప్పుడు గానీ... ప్రతి సందర్భంలోనూ సూటిపోటి విమర్శలతో ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టడంలో రేవంత్ రెడ్డికి తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండటమే.1969, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి... రాజకీయ అరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే... సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతగా ఎదిగారు. 2002లో టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన... 2005లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. పదవీకాలం ముగియకుండానే... 2007లో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి... మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. రెండేళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తన రాజకీయ పరిధిని మరింత పెంచుకున్నారు.2007లో రేవంత్ రెడ్డీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 


తెలంగాణ ఫైర్ బ్రాండ్ కు కలిసొచ్చేనా

2009లో తొలిసారిగా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రేవంత్... కాంగ్రెస్ సీనియర్ నేత రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. తెలంగాణలో టీడీపీకి గడ్డుకాలం తలెత్తిన సమయంలో... 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్... రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందారు.కెరీర్ పీక్ స్టేజ్‌కి చేరుకుంటున్న సమయంలో... ఓటుకు నోటు కేసులో ఆరోపణలు రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి. 2015లో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌కు డబ్బులు ఇస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి... స్టీఫెన్‌ను ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో స్టీఫెన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో నిందితుడిగా జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి... బెయిల్‌పై బయటికొచ్చారు. వచ్చీ రావడంతోనే అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఉహించ‌ని విధంగా త‌నకు కంచుకోటగా ఉన్న కొడంగ‌ల్‌లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రేవంత్. కొడంగ‌ల్‌లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ఎన్నిక‌ల ప్రచారంలో ఆయన ప్రకటించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత రోజులు మీడియాకు దూరంగా ఉన్నారు. తాజాగా లోక స‌భ ఎన్నిక‌లు రావడంతో రేవంత్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మ‌ల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచీ బరిలో ఉన్నారు.రేవంత్ మ‌ల్కాజ్ గిరి నుంచి బ‌రిలో ఉండ‌డంతో ఈ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. మొదటి నుంచీ టీడీపీకి కంచుకోట‌గా ఉన్న మ‌ల్కాజ్ గిరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఏమాత్రం ఉంటాయన్నది అందర్నీ ఆలోచింపజేస్తోంది.