మహబూబ్ నగర్, ఏప్రిల్ 9, (way2newstv.com)
నల్లమల అడవుల అంచున ఉన్న నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు హోరాహొరీగా సాగుతున్నది.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం...కల్వకుర్తి పేరుమీదున్నా...ఆ ప్రాంతానికి నీరు అందడంలేదు. ముందస్తు ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ మాటలు వినిపిస్తున్నాయి. అయినా నీరు కల్వకుర్తి దరికి చేరడంలేదు. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న కల్వకుర్తిలోని మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్ ఇప్పటికే కాల్వలు తవ్వలేదు. సారవంతమైన భూములున్నా కరువు బారిన పడుతున్న అచ్చంపేట నియోజకవర్గానికి సైతం కాల్వలు పూర్తి చేయలేదు. అదే సమయంలో దీర్ఘకాలికంగా సమస్యల హోరు సైతం వినిపిస్తున్నది. కరువు కోరలతో జన జీనస్రవంతికి దూరంగా చెంచుల బతుకులు...ఒకవైపుు...తాగు, సాగు నీటి సమస్యలతో అల్లాడుతున్న ప్రజలు, రైతులు ఇంకోవైపు. సాగునీటి సౌకర్యం కల్పించడంతో వలసలు ఆగిపోయాయంటూ పాలకులు చెబుతున్నా... స్థానిక పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇతర వాగుల్లో అధికార టీఆర్‌ఎస్ అండదండలతో ఇసుక, మట్టిదందా యథేచ్ఛగా నడుస్తున్నది. అధికార దుర్వినియోగం వెరసి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. నెర్రెలుబారిన బీడు భూములను తడిపామని గులాబీ సేన ప్రచారం చేస్తున్నది.
అందని ద్రాక్షగా కల్వకుర్తి
ఈ పథకానికి కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిందని, పది శాతం పూర్తిచేసి టీఆర్‌ఎస్ పార్టీ గొప్పలకు పోతున్నదని కాంగ్రెస్ తిప్పికొడుతున్నది. ఆర్టీఎస్ ద్వారా ఆలంపూర్‌కు నీళ్లు తరలిస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. నాలుగు దశాబ్దాలుగా గద్వాల-మాచర్ల రైల్వే లైన్ సాధిస్తామంటూ అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటివరకూ రైలు పట్టాలెక్కలేదు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల ప్రాంతానికి చేనేత పార్కు మంజూరైంది. పనులు ప్రారంభం కాలేదు. అచ్చంపేట కాగితపు పరిశ్రమ కార్యరూపం దాల్చలేదు. ఏడవ శక్తిపీఠంగా పిలువబడుతున్న జోగులాంబ ఆలయ అభివృద్ధి శూన్యం. నియోజకవర్గంపై పట్టు సాధించి రాజకీయచక్రం తిప్పాలనే లక్ష్యంతో నాడు మంత్రి జుపల్లి కృష్ణారావు...నేడు తాజా మంత్రి నిరంజన్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి ఓడిపోవడంతో నిరంజన్‌రెడ్డి హవా మొదలైంది. ఆ జిల్లా నుంచి మంత్రి ఎవరున్నా...తమ నియోజకవర్గాలకు నీటి వసతి కల్పించేందుకు ప్రయత్నించారు. కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాలకు నీరందించేందుకు కాల్వలు తవ్వారు. ముందస్తు ఎన్నికల్లో హడావుడిగా కాల్వల్లోకి నీరు వదిలారు. కొన్ని చెరువులను నింపారు. ఆ తర్వాత నీటిని ఆపేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాటి పంచాయతీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గానికి కాల్వలు తవ్వించుకున్నారు. నేటి మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి, నాటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్‌గా ఉన్న సమయంలో వనపర్తి నియోజకవర్గానికి నీటిని తరలించారు. వారిద్దరూ సాగునీటిని చూపించి ముందస్తు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు తీవ్రంగా ప్రయత్నించారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులను పావుగా వాడుకుంటున్నారు. గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే గద్వాలలోని అత్యంత కరువు మండలంతోపాటు ఇతర మండలాలకు నీరందించే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు సాగునీటి సమస్యలను ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించే నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వాస్పుత్రికి పోతే ఇక అంతే అని రోగులు అంటున్నారు. ఆధునాతమైన సౌకర్యాలతో ఐసీయూ ఉన్నా...డాక్టర్ల కొరత కారణంగా రోగులకు ఎమర్జెన్సీ వైద్యం అందడంలేదు. ఏ చిన్న రోగమెచ్చినా హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. వంద పడకల ఆస్పత్రి అయినప్పటికీ ఆస్పత్రిలో తాగునీటి సమస్య వెంటాడుతున్నది. ఇప్పటికీ దాతల సాయంతో తాగునీరు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రోగులకు అన్ని సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికుడు స్వామి చెప్పారు. అధికార పార్టీ మళ్లీ అవే సమస్యలను ప్రచారం చేయడంతో ప్రజలు విసిగిపోతున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ ఓటర్ మనోగతం మారుతోందని ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగన్ చెప్పారు. ఇప్పటికి రెండు సార్లు కారుకేశాం...ఈసారి ఆలోచించి ఓటేస్తామని గజ్జెనపల్లికి చెందిన నర్సవ్వ అభిప్రాయపడ్డారు. తొలుత గొర్లు ఇచ్చారు. మళ్లీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇస్తారో లేదో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.