మచిలీపట్నం, ఏప్రిల్ 15 (way2newstv.com):
పూర్వవైభవ దిశగా బందరుపట్టణం పరుగులు పెడుతోంది. ప్రగతి పథంలో పయనిస్తోంది. విశాలమైన రహదారులు.. పచ్చదనపు పరవళ్లు.. అందమైన పార్కులతో ప్రజలకు ఉపాధి కల్పిస్తూ.. నగర రూపు సంతరించుకుంటోంది. జిల్లాకేంద్రమైన మచిలీపట్నం 42 వార్డులు 1.80 లక్షల జనాభాతో విస్తరించి ఉంది. పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది వివిధ వృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా వృత్తి, పిల్లల చదువులు తదితర కారణాలతో ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. తాగునీరు తదితర అనేక సమస్యలకు పరిష్కారం లభించింది.బందరులో ప్రధానమైనది డ్రైనేజీ సమస్య. దీనికి శాశ్వత పరిష్కారం లభించింది. చినుకుపడితే ఆయా ప్రాంతాల ప్రధాన రహదారులు అన్నీ కాలువల మాదిరిగా తయారవుతాయి. పట్టణ భౌగోళిక స్వరూపం దీనికి కారణంగా కనిపిస్తున్నా ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. మొదటి విడత రూ.68.10 కోట్లు, రెండో విడత విడుదలైన నిధులు రూ.21.5 కోట్లు. ఇలా మొత్తం రూ. 90 కోట్లతో పనులు ప్రారంభించారు.
అభివృద్ధి పథం (కృష్ణాజిల్లా)
అంతర్గత కాలువల నిర్మించడంతోపాటు వాటిని అనుసంధానిస్తూ ప్రధాన కాలువకు కలిపేలా చర్యలు తీసుకున్నారు. దీర్ఘకాలిక సమస్యల్లో మరొకటి తాగునీరు. బిందెడు నీళ్లు పట్టుకుంటే వాటిని జాగ్రత్తగా వాడుకొనే పరిస్థితి. అలాంటి సమస్య కూడా పరిష్కారం అవుతోంది. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో 8 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం రూ. 14.50 కోట్లతో రిజర్వాయర్ల నిర్మాణం వాటికి అనుసంధానంగా పురాతన పైపులైన్లు తొలగించి కొత్తవి ఏర్పాటయ్యాయి. రూ.200కు కుళాయి కనెక్షన్ చొప్పున మొత్తం 9వేలు అందిస్తున్నారు. పట్టణం అంతటికీ తరకటూరు సామూహిక రక్షితనీటి చెరువే ఆధారం. 5 మీటర్ల లోతున్న ఆ చెరువును పూర్తిస్థాయిలో నింపేందుకు కృషి చేస్తున్నారు. బందరుకు రోజూ తాగునీరిచ్చేందుకు రూ.22కోట్లతో సమగ్ర రక్షిత నీటి పథకం పనులు ప్రారంభించారు.జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులన్నీ విస్తరించడంతోపాటు మధ్యలో డివైడర్లు, పచ్చదనం పంచుకొనేలా ఏర్పాట్లు చేశారు. ు బైపాస్‌రోడ్డు నిర్మించారు. దీనికి రూ. 9.90 కోట్లు వెచ్చించారు. ఈ రహదారి నిర్మించడం ద్వారా విజయవాడ, గుడివాడ, ఏలూరు, భీమవరం తదితర పట్టణాల నుంచి వచ్చే వాహనాలను పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. కాలేఖాన్‌పేట నుంచి శారదానగర్ వరకు ఉన్న రహదారిని నాలుగువరసల దారిగా అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.2.50 కోట్లు వెచ్చించారు. భవానీపురం వంతెన పనులు కూడా పూర్తవడంతో అటు చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలకు కూడా దూరం తగ్గింది. కలెక్టర్ బంగ్లా నుంచి చిలకలపూడి రైల్వేస్టేషన్ వరకు రూ. 3.15 కోట్లతో రహదారిని విస్తరించారు. రూ. 2 కోట్లతో జిల్లాపరిషత్ సెంటరు నుంచి చిలకలపూడి సెంటరు వరకు రహదారిని విస్తరించడంతోపాటు హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. చిలకలపూడి మదర్‌థెరిసా రింగ్ రైల్వేస్టేషన్ వరకు రోడ్డును నాలుగు వరసల దారిగా విస్తరించేందుకు రూ. 3.50 కోట్లతో పనులు చేపట్టారు. కెనడీ రొడ్డు విస్తరణతోపాటు పలు అభివృద్ధి పనులకు రూ. 15 కోట్లు, కోనేరుసెంటరు నుంచి కోటావారితుళ్ల సెంటరు వరకు రూ. 3.20 కోట్లు వెచ్చిస్తున్నారు.
పట్టణ వ్యాప్తంగా 80కు పైగా పార్కులు ఉన్నాయి. వాటిలో చాలావరకు అధ్వానంగా తయారయ్యాయి. వాటిని అభివృద్ది .చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే మున్సిపల్ ప్రధాన పార్కును తీర్చిదిద్దారు. జాతీయస్థాయిలో పురస్కారం అందుకున్నారు. శిడింబి అగ్రహాం, ఆశీర్వాదపురం, పరాసుపేట తదిత ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి రూ. 9 కోట్లు కేటాయించి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో 1800 ఇళ్లు నిర్మించారు. జీప్లస్‌త్రి విధానంలో 6,400 ఇళ్ల నిర్మాణానికి రూ. 440 కోట్లు వెచ్చించారు.