హైద్రాబాద్, ఏప్రిల్ 24, (way2newstv.com)
తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. అధికార పార్టీ తెరాస ఎప్పటిమాదిరిగానే జెడ్పీలను కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉంది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమౌతోంది. స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకోవాలన్న వ్యూహంతో ఉంది. అయితే, కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల కోసం టీడీపీ కూడా అభ్యర్థుల వేటలో ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ – టీడీపీల మధ్య పొత్తు ఎలా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. నిజానికి, గడచిన లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది. అది కూడా కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల వల్లనే పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత… టీడీపీతో పొత్తు కారణంగానే ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకున్నారు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు
అందుకే, లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి… టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు కొంతమంది సిద్ధమైనా, ఓటు చీలకుండా ఉండాలంటే ఈసారి టీడీపీ పోటీలో ఉండొద్దని కాంగ్రెస్ నేతలు బుజ్జించారు. దీంతో టీడీపీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అదే సమయంలో, టీడీపీకి కాంగ్రెస్ నేతలు ఒక హామీ ఇచ్చారట. తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పట్టున్న అన్ని చోట్లా తమ మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ నేతలు మాటిచ్చారని టి. టీడీపీ నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున పెద్ద సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధమౌతున్నారు. ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి సహకారం అందుతుందనే ధీమాతో టీటీడీపీ ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు వస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ కి లేదు. ఇంకోపక్క, పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెరాసకి వలసపోతున్నారు. సీఎల్పీ విలీనానికి తెరాస ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలనీ, తద్వారా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతంగా ఉందనే సంకేతాలు ఇవ్వొచ్చనేది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. మరి, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు లభిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి! అయితే, లోక్ సభ ఎన్నికల్ని వదులుకున్నాం కాబట్టి, కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిందే అనేది టీడీపీ నేతల డిమాండ్. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకీ అధ్వాన్నంగా తయారౌతోంది కాబట్టి, పట్టు నిలబెట్టుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. మరి, ఈ రెండు పార్టీల మధ్య సర్దుబాటు ఎలా ఉంటుందో చూడాలి