మహబూబ్ నగర్, ఏప్రిల్ 20 (way2newstv.com):
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. వసతులు లేకున్నా సామర్థ్యానికి మించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేకపోయినా అడిగే దిక్కులేదు. వేసవిలో అయినా అధికారులు వసతిగృహాలపై దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు37 ఉన్నాయి. వాటిలో 32 వసతిగృహాలు 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండగా.. 4,900 మంది బాల, బాలికలు ఉంటూ చదువులు కొనసాగిస్తున్నారు. మరో 5 కళాశాల వసతి గృహాలు ఉండగా..వాటిలో 1,600 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. అన్నిచోట్లా పరిమితికి మించి విద్యార్థులను చేర్చుతూ.. వసతులు మాత్రం కల్పించలేక పోతున్నారు. జిల్లాల్లో ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు చేర్చుకోవడంతో వారికి తాగునీరు, వాడుకోవడానికి నీళ్లు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, డైనింగ్ హాల్స్ తదితర సౌకర్యాలను అందించలేక పోతున్నారు. వాటితో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అదనపు గదులు లేవు.
సంక్షేమం పట్టదా..? (మహబూబ్ నగర్)
కొన్ని వసతి గృహాల్లో ఒక్కోగదిలో 20 మందికి మించి విద్యార్థులు పడుకుంటున్నారు. సరైన బెండ్లు కూడా ఇవ్వకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరు చొప్పున పడుకొంటూ అవస్థ పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరితో పాటు నాన్ బోర్డర్స్ కూడ ఎక్కువగా ఉంటున్నారు.వసతి గృహాల్లో ఉంటున్న కళాశాల విద్యార్థులకు ప్రతి నెలా రూ.1.500 చొప్పున ఉపకార వేతనం వస్తుంది. ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థులకు 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న వారికి నెలకు రూ.950, 8, 9, 10వ తరగతులు చదువుతున్న వారికి రూ.1,100 చొప్పున ఉపకార వేతనం ఇస్తున్నారు. గతంలో వీరికి కేవలం రూ.500, రూ.600 చొప్పున ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉపకార వేతనాలను పెంచేశారు. అంతేకాకుండా సన్న బియ్యంతో భోజనం, ప్రతి రోజు గుడ్డు, పండ్లు పెట్టే విధంగా మెనూను మార్చేశారు. కాని విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలను మాత్రం కల్పించలేక పోయారు. అన్ని వసతి గృహాలలో ప్రధానంగా అదనపు గదుల కొరత తీవ్రంగా ఉంది. వాటితో పాటు మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సమస్య, తదితరవి ఉన్నాయి.ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో వసతిగృహాల్లోని విద్యార్థులు ఊళ్లకు వెళ్లారు. ఈ సెలవుల్లోనే అధికారులు సదుపాయాల కల్పన, గదుల నిర్మాణాలు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరో నెలన్నర గడిచిందంటే మళ్లీ వసతి గృహాలు ప్రారంభం అవుతాయి. అవే సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.