న్యూఢిల్లీ ఏప్రిల్ 26 (way2newstv.com),
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అరుముగస్వామి కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ కమిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అపొల్లో ఆస్పత్రి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... ఈ కేసు విచారణపై సర్వోన్నత ధర్మాసనం స్టే విధించింది. కాగా జయ లలిత మృతి కేసు విచారణలో భాగంగా అరుముగస్వామి కమిషన్ జయ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కేఎస్ శివకుమార్ సహా 100 మందికి పైగా ప్రశ్నించింది.
జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీం స్టే...
అపొల్లో ఆస్పత్రి రేడియాలజిస్టు డాక్టర్ మీరా, ఎమర్జెన్సీ డాక్టర్ తావా పజని కూడా విచారణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. అయితే విచారణ పేరుతో తమ వైద్యులను వేధింపులకు గురిచేస్తున్నారని అపొల్లో యాజమాన్యం ఆరోపించిన సంగతి తెలిసిందే.2016 డిసెంబర్ 5 న జయలలిత మృతి చెందినట్టు చెన్నైలోని అపొల్లో ఆస్పత్రి ప్రకటించింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో సెప్టెంబర్ 22న ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమె మరణించగానే ఏదో కుట్ర జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. జయలలిత అందించిన చికిత్సపైనా సందేహాలు వెల్లువెత్తాయి. దీంతో జయలలిత మృతికి గల కారణాలపై దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుముగంస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటైంది.