శ్రీకాకుళం, ఏప్రిల్ 08 (way2newstv.com):
సుడా పరిధిలోని పురపాలికలు: శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస- కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పురపాలక సంఘాలు, రాజాం, పాలకొండ నగర పంచాయతీలతో పాటు జిల్లాలోని 28 మండలాల పరిధిలోని 1264 గ్రామాలు ఏటేటా విస్తరిస్తున్న శ్రీకాకుళం నగరాభివృద్ధి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 12న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. సుడాకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పాలకవర్గంలో ఎవరు సభ్యులుగా ఉంటారనే విషయంపై ఈ నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ ఛైర్మన్ మినహా ఇతర సభ్యులుగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులే వ్యవహరించనున్నారు. కొద్ది రోజుల్లో వీసీగా సంయుక్త కలెక్టర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. సుడా పాలకవర్గం నియామకమైన తర్వాత పూర్తిస్థాయిలో సుడా కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయి.సుడా పరిధిలోని ప్రాంతాలకు సంబంధించి 20 ఏళ్లలో సమగ్ర అభివృద్ధి చెందేలా కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బృహత్ ప్రణాళికలో ఏయే ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, భవిష్యత్తు అవసరాలు రీత్యా ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అనువుగా ఏయే రహదారులు ఏయే మేర విస్తరించాల్సి ఉంటుంది..
అభివృద్ధి పరుగులు (శ్రీకాకుళం)
కొత్తగా బాహ్యవలయ రహదారుల నియామకం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ జోన్‌లు వంటివి ఈ బృహత్ ప్రణాళికలో పొందుపర్చుతారు. ప్రజలతో చర్చించి ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా రూపొందిస్తారు. తద్వారా భవిష్యత్తులో అందుకు అనుగుణంగా పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. బృహత్ ప్రణాళికలో ప్రభుత్వ స్థలాలు, ఇతర ఆస్తులు, కార్యాలయాలు, రహదారులు, చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు పొందుపర్చుతారు. తద్వారా భవిష్యత్తులో ఆక్రమణలకు గురికాకుండా సంరక్షించేందుకు, ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది.సుడా పరిధిలోని పంచాయతీల్లో 200చ.మీ. పైబడిన స్థలాల్లో నిర్మాణాలకు సుడా అనుమతి తీసుకోవాలి. పురపాలక సంఘాల్లో జీ ప్లస్ 5 పైబడిన నిర్మాణాలకు సుడా అనుమతి పొందాలి. ఐఏఎస్ స్థాయి అధికారి వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించే సుడాలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని ధ్రువపత్రాలు, భవ నిర్మాణంలో చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటే తప్ప అనుమతులు మంజూరు అయ్యే అవకాశం ఉండదు. తద్వారా ఇటువంటి బహుళ అంతస్తు భవనాల్లో భవిష్యత్తులో ప్రమాదాలు సైతం తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.సుడా పరిధిలోని అన్ని పంచాయతీలు, పురపాలక సంఘాల పరిధిలో అన్ని ప్రాంతాల్లో కొత్తగా వేసే లేఅవుట్లకు సుడా అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. సుడా నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఈ లేఅవుట్లకు వెళ్లేందుకు అప్రోచ్ రహదారి, లేఅవుట్‌లో 40 అడుగుల అంతర్గత రహదారులు, కాలువలు, పాఠశాలలు, సామాజిక భవనాల నిర్మాణాలకు అనుగుణంగా ఖాళీ స్థలాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఆ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేసే వారికి ప్లాన్ల మంజూరుతో పాటు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక సంస్థలకు సైతం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధుల వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇటువంటి లేవుట్లతో భవిష్యత్తులో ప్రణాళికాబద్ధమైన కాలనీలు ఏర్పడి మురికివాడలు లేని సుందరమైన నగర విస్తరణ సాధ్యపడుతుంది.