అనంతపురం, ఏప్రిల్ 26(way2newstv.com):
వర్షాలు కురవకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో సరిపడా నీళ్లులేక రైతన్నలు మల్బరీ పంటను వదిలేశారు. ప్రస్తుతం 5 టన్నుల వరకు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 25వేల మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. కర్ణాటక, చిత్తూరు, కర్నూలు, మహబూబ్‌నగర్, మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు ఇక్కడి మార్కెట్‌కు వస్తున్నాయి. పట్టుసాగుపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పంటలు దెబ్బతింటున్నాయి. పట్టు పురుగుల పెంపకానికి షెడ్లలో 25-28 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. ప్రస్తుతం 38 డిగ్రీల వరకు ఉంటోంది. షెడ్లకు గోనె సంచులు వేసి వాటిపై నీటిని చల్లి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సాగు వదిలేశారు (అనంతపురం)
జిల్లాలో భూగర్బజలాలు తగ్గి బోర్లలో నీళ్లు లేక పోవడంతో 12 వేల ఎకరాల్లో పంట వదిలేశారు. మళ్లీ వర్షాలు పడితే తప్ప పెంపకం చేపట్టే స్థితిలో లేరు. ప్రస్తుతం 20వేల ఎకరాల్లోనే మల్బరీ సాగులో ఉంది. పట్టుగూళ్ల మార్కెట్‌లో పలుకుతున్న ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. బైవోల్టిన్ కిలో రూ.415 గరిష్ఠ ధర కాగా సగటు రూ.300 వరకు ఉంది. సిబి గూళ్లు కిలో గరిష్ఠం రూ.285 కాగా కనిష్ఠం రూ.160 పలుకుతోంది. బైవొల్టిన్ పట్టుగూళ్లు మార్కెట్‌కు తెచ్చే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం రూపంలో కిలోపై రూ.50 వరకు అందిస్తోంది. ఈ మొత్తం జనవరి నుంచి రైతులకు రూ.1.76 కోట్ల వరకు బకాయి పడింది. అందివ్వాలంటూ సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు మార్కెట్ ఇన్‌స్పెక్టర్ మారుతీరావు పేర్కొన్నారు.మార్కెట్‌లో పట్టుగూళ్ల ధరలు పడిపోవటంతో అదే స్థాయిలో సిల్క్‌ధరలు పడిపోతున్నాయి. సిల్క్ రూ.3,800 నుంచి రూ.3,200లు, డూపెన్ సిల్క్ రూ.2,400 నుంచి రూ.2,100కు పడిపోవటంతో రీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనైనా ధరలు పెరుగుతాయని కొందరు రీలర్లు తమవద్ద సిల్క్‌ను నిల్వచేసుకోగా మరికొందరు నష్టమైనా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.