హైద్రాబాద్, ఏప్రిల్ 25, (way2newstv.com)
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే. అసాధ్యాలు, కాలం ఇచ్చే తీర్పులతో సాధ్యం అయి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఉంటాయి. దీనికి పెద్ద ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నడుమ ఐదు సంవత్సరాల కాలంలో సాగిన రాజకీయాలే తార్కాణంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఇచ్చేది తామే తెచ్చేది తామే అంటూ 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నినాదం. ఆ ప్రచారానికి విరుగుడుగా టీఆర్ఎస్ బ్రహ్మాస్త్రం సంధించి తెలంగాణ ఇస్తే తమ పార్టీనే విలీనం చేస్తామని ప్రకటించి సంచలనం సృష్ట్టించింది.తెలంగాణ సాధన కోసం కుష్టి రోగినైనా, గొంగళి పురుగు ను సైతం ముద్దాడుతామని ప్రకటించి కాంగ్రెస్ ను వ్యూహాత్మకంగా తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించింది. అనుకున్నట్లే కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ అధిష్టానం కళ్ల తెరిచేలోపు.. కనుమరుగు
అనుకున్నట్లే గులాబీ పార్టీ తమ పార్టీలో విలీనం అవుతుందని స్నేహ హస్తం అందించింది. అంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ కి గులాబీ బాస్ షాక్ ఇచ్చారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా కు కుటుంబం తో సహా వెళ్ళి కాళ్ళు మొక్కి కొత్త రాష్ట్రం అభివృద్ధి తమ పార్టీ తోనే సాధ్యమని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. అంతే కాదు తెలంగాణ ఇచ్చిన పార్టీకి కాకుండా పోరాడిన పార్టీకే జనం పట్టం కట్టేలా కెసిఆర్ పదునైన వ్యూహంతో అధికారపీఠం ఎక్కేశారుఇక్కడి వరకు సినిమా బాగానే నడిచింది. ఆ తరువాతే గులాబీ బాస్ కాంగ్రెస్ కి చుక్కలు చూపించారు. అధికారం లోకి వచ్చాకా కాంగ్రెస్ కి నామరూపాలు లేకుండా చేస్తూనే వచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి హస్తాన్ని ఊపిరి పీల్చుకోకుండా చావు దెబ్బ తీశారు. అక్కడితో ఆయన ఆగలేదు. అసెంబ్లీకి ఎన్నికైన అరకొర కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారెక్కేస్తూ వచ్చారు. అది కాంగ్రెస్, టిఆర్ఎస్ లో విలీనం అయిపోయిందనే స్థాయికి నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ కుడితిలో పడింది. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేసుకుని తెలంగాణ హస్తగతం చేసుకుందామని భావిస్తే చివరికి ప్రత్యర్థి వ్యూహానికి బలై పోయి పార్టీని రక్షించుకోలేక లబోదిబోమనే దుస్థితి ఆధునిక భారతంలో చర్చనీయంగా మారింది. ఇప్పుడు అంపశయ్యపై వున్న కాంగ్రెస్ ను కాపాడే లీడర్ టి కాంగ్రెస్ లో ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్న గా హస్తం అధిష్టానం మదిని తొలిచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఐదు దశలు పూర్తి అయ్యేవరకు తెలంగాణ పార్టీ రాజకీయాలపై దృష్టి సారించలేని హస్తిన కాంగ్రెస్ తేరుకునే లోగా టి కాంగ్రెస్ లో మిగిలిన వికెట్లు రాలిపోతాయా లేక ఎన్ని మిగులుతాయి అన్నది ఆసక్తికరం.