కలెక్టరేట్ ముట్టడించిన టీయుడబ్ల్యుజె
హైదరాబాదు, ఏప్రిల్ 27 (way2newstv.com)
ప్రభుత్వ వ్యతిరేక వార్త రాసాడన్న నెపంతో మేడ్చల్ జిల్లా ఈనాడు ప్రతినిధి భానుచందర్ రెడ్డి అక్రెడిటేషన్ కార్డును రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నేతృత్వంలో శనివారం నాడు వందలాది మంది జర్నలిస్టులతో కిసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మెహరించి, జర్నలిస్టుల ఆందోళనను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను యూనియన్ ప్రతిఘటించింది.
అక్రెడిటేషన్ రద్దుపై నిరసన...
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి విరాహత్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టులను లొంగబర్చుకునేందుకు అక్రెడిటేషన్ రద్దు ఉత్తర్వులను జారీచేసి ప్రభుత్వం హెచ్చరికలు చేయడం అప్రజాస్వామికమన్నారు. మేడ్చల్ జిల్లా ఈనాడు జిల్లా ప్రతినిధి భానుచందర్ రెడ్డి అక్రెడిటేషన్ కార్డును రద్దు చేయడమంటే ఒక వ్యక్తి గుర్తింపును రద్దు చేయడం కాదని, యావత్తు మీడియానే అవమానించడమని ఆయన ధ్వజమెత్తారు. అక్రెడిటేషన్ కమిటీతో చర్చించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రద్దు ఉత్తర్వులు జారీ చేసే హక్కు కలెక్టర్ కు గానీ, కమీషనర్ కు గానీ లేదన్నారు. రద్దు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేస్తామని, ఈ నెల 29, 30 తేదీల్లో జరుగుతున్న టీయుడబ్ల్యుజె రాష్ట్ర మహాసభల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చిస్తామని విరాహత్ హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర కోశాధికారి మహిపాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకట్ రెడ్డి, జి.బలరాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెంకటేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవీందర్, మల్కయ్య, డి.జి.శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.వి.రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు.
Tags:
telangananews