వైసీపీకి గోదావరి వర్రీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసీపీకి గోదావరి వర్రీ

కాకినాడ, ఏప్రిల్ 23, (way2newstv.com)
పైకి తమదే విజయం అంటున్నా గోదావరి జిల్లాల్లో జనసేన తమ కొంప ముంచిందేమోనన్న భయం వైసీపీని వెంటాడుతోంది. మెజారిటీ స్ధానాలు తమవే అంటూ సర్వేలు ఢంకా బజాయిస్తున్నా... గోదావరి జిల్లాల్లో ఆధిక్యం సాధించలేకపోతే అధికారం మరోసారి అందని ద్రాక్షే అవుతుందని వైసీపీ భయపడుతోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ సీటుకు జనసేన ఎసరు పెట్టిందనే వార్తలు ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంతా అడిగే ప్రశ్న గోదావరి జిల్లాల్లో పరిస్ధితి ఏమిటి ? గోదావరి జిల్లాలను గెలిచే పార్టీ... అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమన్నది జగమెరిగిన సత్యం కూడా. అంతెందుకు గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో దాదాపు స్వీప్ చేసిన టీడీపీ... దర్జాగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలిగింది. టీడీపీ విజయానికి గోదావరి జిల్లాలు అండగా నిలవడం దశాబ్దం తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపకరించింది. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత కూడా గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్ధానాల్లో ఆధిక్యం కోసం పార్టీలు చేయని ఫీట్లు లేవు. అలాంటిది ఈసారి గోదావరి జిల్లాల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందన్నది టీడీపీ, వైసీపీలకు పూర్తిగా అంతుబట్టడం లేదు. దీనికి కారణం తొలిసారి పోటీ చేసిన జనసేన పార్టీయే. ప్రతీ సెగ్మెంట్లోనూ జనసేన ఎన్ని ఓట్లు చీల్చిందనే దానిపైనే పార్టీల విజయం ఆధారపడి ఉంది.


వైసీపీకి గోదావరి వర్రీ

రాష్ట్రంలో ఈసారి మార్పు తథ్యమని, వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నా... ఆ పార్టీలో మాత్రం లోలోపల తెలియని ఆందోళన. దీనికి కారణం రాష్ట్రమంతటా ఫ్యాను గాలి వీచినా.. కాపు సామాజికవర్గం జనసేనకు అండగా నిలిచిన గోదావరి జిల్లాల్లో మాత్రం పరిస్ధితి ఏమిటన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. నరసాపురం ఎంపీ సెగ్మెంట‌్ తో పాటు గోదావరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లోనూ జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వైసీపీలో ఆందోళన రేపుతున్నాయి. పైకి గెలుపు తమదేనని చెబుతున్నా... గోదావరిజిల్లాల్లోజనసేన ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంశంపై ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు ఆరాలు తీసే పనిలో నిమగ్నమయ్యారు.పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, కాకినాడ రూరల్ వంటి చోట్ల జనసేనకు గెలుపు అవకాశాలు గట్టిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరో అరడజను స్ధానాల్లో జనసేన భారీగా కాపు ఓట్లను చీల్చేసింది. దీనికి క్రాస్ ఓటింగ్ కూడా తోడవడంతో నరసాపురం ఎంపీ సీటులో జనసేన తరఫున బరిలో నిలిచిన నాగబాబు గెలిచినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు బూత్ ల వారీగా జనసేనకు పడిన ఓట్లను ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.జనసేన తమ ఓట్లను చీల్చిందనే వైసీపీ భయాల వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది కాపు ఓటు బ్యాంకు. ఐదేళ్లుగా టీడీపీ తమను మోసం చేసి, ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహంగా ఉన్న కాపు సామాజికవర్గం ఈసారి జనసేనకు గంపగుత్తగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మైనార్టీలు కూడా బీజేపీతో వైసీపీ రహస్య అవగాహన అంటూ జరిగిన ప్రచారాన్ని కొంతవరకూ నమ్మినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో మైనార్టీల్లో ఓ వర్గం జనసేనకు ఓట్లేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలు వైసీపీకి మైనస్ గా మారబోతున్నాయి. అందుకే జనసేన ప్రభావం తెలుసుకునేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది