మెదక్, ఏప్రిల్ 03 (way2newstv.com):
సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కుంటలు, చెరువులపై అక్రమార్కుల కళ్లు పడుతున్నాయి. ఏ ఆధారం లేని పత్రాలు చూపి స్థానిక అధికారులను సైతం భయబ్రాంతులకు గురిచేస్తుండటం విశేషం. కొందరు గతంలో అనుమతులు తీసుకున్నారంటూ ఆ పత్రాన్ని చూపుతున్నారు. ఇందుకు సంబందించిన ఆధారాలు పంచాయతీ కార్యాలయాల్లో ఉండటం లేదు. అనుమతిపత్రం ఉన్న తేదీల్లో పంచాయతీకి పన్నులు చెల్లించారా? అని స్థానిక అధికారులు దస్త్రాలు తనిఖీ చేసినా అవేం ఉండటం లేదు. ఈ విషయంలోనూ స్థానిక నేతలు భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ కొన్ని ఉదహరణలే. రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టారీతిన అక్రమార్కులు తెగిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని హెచ్‌ఎండీఏ పరిధిలోని 11 మండలాల్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వాటిని కబ్జా చెర నుంచి విముక్తులకు చేయడానికి కృషి చేస్తామని రెవెన్యూ, నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.
చెరువులు మాయం... (మెదక్)
అక్రమణలకు చెక్ పెట్టేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే రెవెన్యూ, నీటి పారుదల శాఖల సహకారంతో 11 మండలాల్లోని చెరువులు, కుంటలను గుర్తించారు. ఇందులో మొదట అత్యంత విలువైన స్థలాలు పటాన్‌చెరులు నియోజక వర్గంపై దృష్టి సారించనున్నట్లు ఓ అధికారి ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల మండలాల చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయిస్తారు. ఆయా మండలాల్లో ఏ మాత్రం ఆక్రమణలు ఉన్నా ఎటువంటి తాఖీదులు లేకుండా కూల్చుతారని అంటున్నారు. పెద్ద నిర్మాణాలు ఉన్నా తాఖీదులు ఇవ్వరని అంటున్నారు. ఒక వేళ ఇస్తే వాటిని ఆధారంగా చేసుకొని న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ఆక్రమణలపై త్వరలో హెచ్‌ఎండీఏ ఉక్కు పాదం మోపనుందని చెబుతున్నారు. శిఖం, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ రక్షణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. పకడ్భందీ వ్యూహంతో యంత్రాంగం సిద్దం అవుతుందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత రక్షణ చర్యలు ప్రారంభం కానున్నాయి.చెరువులు, కుంటల్లో నిర్మాణాలు చేస్తే నష్టపోయేది ఈ స్థలాలను కొన్న వారేనని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కొందరు ప్రజా నాయకుల అండదండలతో నిర్మాణాలు చేసినా కూల్చే సమయానికి ఎవరూ రారని అంటున్నారు. అడ్డుకునే ప్రయత్నాలు చేసినా క్రిమినల్ చర్యలు తప్పవని చెబుతున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ప్రయోగిస్తామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణాలు చేస్తున్న వారు ఆలోచించుకోవాలని, దళారుల మాటలు వింటే మాత్రం నిలువునా మోసపోతారనే సమాచారం ఇస్తున్నారు.