మెదక్, ఏప్రిల్ 1(way2newstv.com):
శనగలు విక్రయించి పదిరోజులు పూర్తవుతున్నా కొనుగోళ్లకు సంబంధించిన నగదు ఖాతాల్లో జమ కాలేదని రైతులు వాపోతున్నారు. మూడు రోజుల్లో చెల్లింపులు చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు బ్యాంకులు, కేంద్రం చుట్టూ తిరిగిపోతున్నారు. మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే అవసరానికి నగదు చేతికందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శనగల కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్, చేర్యాలలో ఈనెల 12 నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది.చేర్యాలలో మూడు రోజుల తర్వాత సరకు రాకపోవటంతో కేంద్రాన్ని మూసివేశారు. 220 మంది రైతుల నుంచి రూ.88,70,400 విలువైన 1920 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఎవరికీ చెల్లింపులు చేయలేదు.
డబ్బులేవీ..? (మెదక్)
గజ్వేల్ కేంద్రంలో మొత్తం 320 మంది రైతుల నుంచి రూ.1,46,68,500 విలువైన 3175 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేయగా పది రోజులు దాటిపోతున్నా చెల్లింపులు చేయటం లేదు.బహిరంగ విపణిలో ధర చాలా తక్కువగా ఉండటంతో మద్దతు ధర పొందేందుకు రైతులు శనగలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ముందుకు వచ్చారు. జిల్లాలో రబీలో 3120 ఎకరాల్లో శనగ సాగు చేయగా ఎకరాకు పది క్వింటాళ్ల మేర దిగుబడి రానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దాదాపు 1,31,200 క్వింటాళ్ల శనగలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 15 వేల క్వింటాళ్లు కొనుగోలు కేంద్రాలకు రావొచ్చన్న అంచనాతో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మొత్తం రూ.2,35,38,900 విలువైన 5095 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.గత ఏడాది క్వింటాలు శనగలకు రూ.4400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఈసారి క్వింటాలుకు రూ.220 పెంచటంతో రూ.4620 చేరింది. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాలు శనగలు రూ.3800 నుంచి రూ.4 వేలు మాత్రమే పలుకుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావటంతో రైతులు పండించిన శనగలకు మద్దతు ధర లభించినప్పటికీ విక్రయించిన తరువాత త్వరగా నగదు చేతికి రాకపోవటంతో రైతులు నిట్టూరుస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే వారికి చెల్లింపులు చేయాలని కోరుతున్నారు.