విజయవాడ, ఏప్రిల్ 27, (way2newstv.com)
బెజవాడ రాజకీయాలంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి. ఇక్కడ ఏం జరిగినా పెద్ద ఎత్తున రాష్ట్ర మంతా ఆసక్తిగా చూస్తుంది. ఇక, ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఎంతో ఆసక్తి ఉంది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఎవరు గెలుస్తారా? అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నగరం కూడా విజయవాడే. ఇక, ఇక్కడున్న మూడు నియోజకవర్గాల్లో బాగా వార్తల్లోకి ఎక్కిన నియోజకవర్గం వెస్ట్. ఇక్కడ ఒక పార్టీఅని కాకుండా ప్రజలు వారికి నచ్చిన పార్టీని ఇక్కడ నిలబెడుతున్న పరిస్థితి ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా గడిచిన రెండు ఎన్నికల నాటి పరిస్థితిని తీసుకుంటే.. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను ఎన్నుకున్నారు.2014లో వైసీపీ తరపున గెలుపు గుర్రం ఎక్కిన జలీల్ ఖాన్.. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ మారిపోయారు. టీడీపీకి జై కొట్టారు. తాజా ఎన్నికల్లో ఆయన తప్పుకొని ఆయన కుమార్తె షబానా ఖతూన్‌కు టికెట్ ఇప్పిం చుకున్నారు.
వెస్ట్ లో కోరాడ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందా
ఇక, ఇక్కడ నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలిచారు. దీంతో నియోజకవర్గంలో మహిళా సెంటిమెంట్ సహా వైసీపీ అధినేత జగన్ సెంటిమెంట్ కూడా బాగానే పనిచేసింది. ఇదిలావుంటే కాంగ్రెస్ లేదా వైసీపీ టికెట్ ఆశించిన కోరాడ విజయ్‌కుమార్ ఈ దఫా స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు. దీంతో ప్రధాన పార్టీలతో పాటు ఆయన కూడా తన సత్తా చూపిం చేందుకు రెడీ అయ్యారు.ఈ నేపథ్యంలో వెస్ట్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతూనా? వెల్లంపల్లా? కోరాడ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా? అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కోరాడ ఎలాగైనా గెలిచి తీరాలని నిర్ణయించుకుని ఆర్థికంగా బాగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక, అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే.. ఖతూన్ అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి పోటీ చేయడం మొదట్లో ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. పోలింగ్ సమయానికి ఆమె తిరిగి అమెరికా వెళ్లిపోతారని, తమ సమస్యలను పట్టించుకోరనే ప్రచారం జోరుగా సాగింది.దీంతో మొదట్లో ఉన్న సానుకూలత పోలింగ్ మేనేజ్‌మెంట్ విషయం వచ్చే సరికి పూర్తిగా మారిపోయింది.ఇక, వెల్లంపల్లి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పెద్దగా తమను పట్టించుకోలేదనే టాక్ కూడా వినిపిస్తొంది. పైగా పార్టీలు మారతారనే అపవాదు ఆయన పై పడిపోయింది. దీంతో ఇక్కడ కోరాడ విజయకుమార్ కూడా గట్టి పోటీ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. అయితే, స్వతంత్ర అభ్యర్థిని గెలిపించినా ప్రయోజనం ఉంటుందా? అనే ప్రశ్న కూడా ఇక్కడ హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు? ఎవరు ఓడతారు? అనేది ఉత్కంఠగా మారింది. మరి ప్రజలు ఎవరిని వరించారో తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయకతప్పదని అంటున్నారు.