సమ్మర్ దొంగతనాలు జరాభద్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమ్మర్ దొంగతనాలు జరాభద్రం

వరంగల్, ఏప్రిల్ 12 (way2newstv.com)
వేసవిలో పిల్లలకు సెలవులు ఉంటాయి. బంధువుల ఇళ్లకో, విహార యాత్రలకో వెళ్లడం సర్వసాధారణం.. ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారా.. దొంగల భయం ఉందా... మీ సొమ్ము భద్రంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పరీక్షలు పూర్తి కాగానే ప్రజలు విహార యాత్రలకు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలకు రక్షణ కంచెను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు ఎండలు మండిపోతుండడంతో రాత్రి సమయాల్లో ఇంటికి తాళం వేయకుండా, కేవలం గడియ పెట్టి ఇంటి డాబాలపై పడుకుంటారు. మరికొందరు ప్రధాన ద్వారం పక్కన ఉండే కిటికీలు తెరిచి పడుకుంటారు. ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దొంగతనాలు జరిగేందుకు అవకాశం కల్పించినట్లవుతోంది. ఈ క్రమంలో ప్రజలు వస్తువులు పోగొట్టుకోకుండా జాగ్రత్తలతో చోరీలకు కళ్లెం వేసేందుకు పోలీసులు ప్రచారం ప్రారంభించారు. ఎండాకాలంలో దొంగలకు కలిసొచ్చేది మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయాలే. అందులోనూ దొంగలకు అమావాస్య మరింతగా కలిసి వస్తుంది. 


సమ్మర్ దొంగతనాలు జరాభద్రం

అమావాస్య చీకటిలో వెలుతురు లేకుండా అంధకారం ఉండడం దొంగతనాలకు పాల్పడేందుకు కలిసి వచ్చే అంశమని పలువురు దొంగలు పట్టుబడినప్పుడు బయటపడ్డ విషయం. ఈ కాలంలో దొంగలు మధ్యాహ్నం సమయంలో రెక్కీ వేసుకుని రాత్రి సమయాల్లో చోరీలకు తెగబడుతున్నారు. తెరిచి ఉన్న కిటికీలోంచి కర్ర, ఇనుప రాడ్లతో ప్రధాన ద్వారాలను తెరవడం లేదా వాటితో కనిపించే విలువైన వస్తువులను దొంగిలిస్తారు. దీనికోసం సరైన భద్రత ప్రమాణాలను పాటించని ఇండ్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఇండ్లను ఎంపిక చేసుకుంటారు. అంతే గాకుండా ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను కూడా దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ చోరీలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. 
పాటించాల్సిన జాగ్రత్తలు...
- నేరేడుచర్ల పోలింగ్ కేంద్రంలో ఇంటికి తాళాలు వేసుకుని ఊర్లకు, విహార యాత్రలకు వెళ్లే వారు ఫోన్ నెంబరు, ఇంటి చిరునామాను స్థానిక పోలీసులకు తెలుపాలి.
- ఇంటి పక్క వారికి లేదా నమ్మకమైన వారికి తాళం ఉన్న ఇంటిని గమనిస్తుండాలని కోరాలి. 
- ఇంటికి తాళం వేసి బయటపెట్టొద్దు.
- కిటికీలను పూర్తిగా మూసేయాలి. 
- బంగారు ఆభరణాలు వేసుకుని బయట పడుకోవద్దు. 
- తాళం బయటకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
- ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల గురించి బహిరంగంగా చెప్పుకోవద్దు. 
- ఇంట్లో ఒంటరిగా ఉండే వారు అనుమానాస్పద వ్యక్తులను లోపలికి రానివ్వకూడదు. 
- మధ్యాహ్న సమయాల్లో కాలనీల్లో తిరుగుతూ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 
- ఇంటికి తాళం వేసి వెళ్లినప్పుడు టైమర్‌తో కూడిన లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. 
- ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉండాలి. 
- తాళం వేసి వెళ్తున్నపుడు అలారమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
- మహిళలు ఆభరణాలు ధరించి బయటికి వెళ్తున్న సమయంలో చీర కొంగును నిండుగా కప్పుకోవాలి. 
- విలువైన వస్తువులను లాకర్లలో పెట్టుకోవాలి. 
- వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇంట్లో ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
- రైల్వే ట్రాక్ పక్కన ఉండే వారు అప్రమత్తంగా ఉండాలి. 
- ప్రతి ఒక్కరూ స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్, బీట్ కానిస్టేబుల్ నెంబర్‌ను దగ్గర పెట్టుకోవాలి. 
- ఇండ్లను అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు, ఆధార్ లేదా ఇతర ధృవీకరణ పత్రాలు తీసుకోవాలి. 
- చిన్నారుల మెడలో బంగారం ఉండకుండా చూసుకోవాలి. 
- ఎక్కువగా శబ్ధం చేసే కూలర్లు, ఫ్యాన్లు వాడడం వల్ల రాత్రి సమయాల్లో దొంగల అలికిడి వినలేం. 
- కుక్కలను పెంచుకోవడం మంచిది. 
- శుభకార్యాల్లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతుంటారు. అందుకూ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి.