మాఫియా రాజ్యం (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాఫియా రాజ్యం (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఏప్రిల్ 08(way2newstv.com): 
కొందరు అక్రమార్కులు అడవినే ఆదాయంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వందల కోట్ల రూపాయల దుర్భేద్యమైన టేకు వనాలను గొడ్డలి వేటు, అధునాతన యంత్రాలతో నేలకొరిగించి సొమ్ము చేసుకుంటూ అడవులను మైదానాలుగా మార్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుకబట్టీల నిర్వహణ, వాగులు, నదుల్లో నుంచి ఇసుకను తరలిస్తున్నారు. కొన్ని అటవీ గ్రామాల్లో నాటుసారా కాస్తున్నట్లుగా తెలుస్తోంది. సహజసిద్ధమైన గుట్టల మొరాన్ని తవ్వేస్తూ జేబులు నింపుకొంటున్నారు. జంతువుల వేట సైతం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోందని ప్రచారంలో ఉంది.సహజసిద్ధమైన అటవీ గుట్టల నుంచి ఎర్ర, నల్ల మొరాన్ని తొలిచి ట్రాక్టర్లు, టిప్పర్‌ లారీల ద్వారా తరలిస్తూ కొందరు అక్రమార్కులు రూ.లక్షలు గడిస్తున్నారు. నిబంధనలను విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు అశ్రద్ధ వహించడం గమనార్హం. గుట్టలు రెవెన్యూకు సంబంధించినవంటే లేదు అటవీశాఖవని పేర్కొంటూ కొన్నిచోట్ల శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా మొరం తవ్వకాలు దర్జాగా సాగుతున్నాయి. ఇచ్చోడ మండలంలోని బాబుల్‌డో బోడ గుట్టను చుట్టూ తొలిచారు. వెనుకభాగం పెద్ద మొత్తంలో మొరాన్ని తొలిచి తీసుకెళ్లారు. దీంతో సగానికి పైగా ఆ గుట్ట కరిగిపోయింది. దాని పక్కనే పెద్దగుట్టను తొలిచారు. ఇదే మండలంలోని చిన్న సల్యాద గ్రామంలోని గుట్టను సైతం తొలిచి రోడ్డు పనులకు వాడారు. సిరిచెల్మ ఘాట్‌ కింద గల గుట్ట, గుబ్బ చెరువు పక్కన గల గుట్ట గతంలో తవ్వేశారు. నేరడిగొండ మండలంలోని కుప్టీలో పెద్దఎత్తున మొరం తవ్వకాల కారణంగా రెండు, మూడు గుట్టలను తొలిచారు. 


మాఫియా రాజ్యం (ఆదిలాబాద్)

ఇదే మండలంలోని వాగ్దారికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన గుట్టను తవ్వేశారు. బోథ్‌, బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌ మండలాల్లోని పలు గుట్టల నుంచి మొరం తవ్వకాలు జరిపారు. అభివృద్ధి పనుల పేరుతో మొరం తవ్వకాలు పెద్దఎత్తున సాగుతున్నాయి.విచ్చలవిడిగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలను దర్జాగా నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల చెరువులు, శిఖం భూముల్లోనూ కొనసాగిస్తున్నారు. అధికారులు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మలోని వ్యవసాయ భూముల్లో ఇటుకబట్టీలను చెరువు పక్కన, శిఖం భూముల్లో నిర్వహిస్తున్నారు. ఒక్క సిరిచెల్మ శివారులోనే 8 వరకు ఇటుక బట్టీలుండడం గమనార్హం. బొగ్గుతో పాటు అడవిలోని కర్రలను సైతం ఇటుక బట్టీలను కాల్చడానికి వాడడం, అక్కడి ఒండ్రు, చెరువు మట్టిని ఇటుకకు వాడుతున్నారు. సిరికొండ, ఆదిలాబాద్‌ శివారు ప్రాంతాలు, బట్టి సవర్‌ర్గాం, తలమడుగు మండలంలోనూ ఇటుకబట్టీలను నిర్వహిస్తున్నారు.ఒకప్పుడు జిల్లా అభయారణ్యాలకు ఖిల్లాగా ఉండేది. కలప స్మగ్లర్ల ధాటికి మైదానాలుగా మారాయి. అడవుల జిలాల్లో ఇపుడు రోడ్లకు ఇరువైపుల మాత్రమే చెట్లు లోపలంతా మైదానాలుగా దర్శనమిస్తున్నాయి. అటవీశాఖలో కవ్వాల్‌ సెక్షన్‌, విజిలెన్స్‌ సెక్షన్‌తో పాటు అనేక విభాగాలుగా అధికారులు అడవిని పర్యవేక్షిస్తున్నా చెట్ల నరకివేత ఆగడం లేదు. ఈ పాటికే ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ, సిరికొండ మండలంలోని వాయిపేట, నారాయణ్‌పూర్‌, ఫకీర్‌పేట, భీంపూర్‌, రిమ్మ, సాథ్‌మోరి, చిమ్మన్‌గుడి, పోచంపల్లి ప్రాంతాలు మైదానాలుగా మారాయి. ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, బోథ్‌, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలు మైదానాలుగా మారాయి. వందల ఎకరాలు సాగు భూములయ్యాయి. కోట్లాది రూపాయల కలప జిల్లా దాటిపోయింది. అక్రమంగా తరలిస్తున్న కలప వాహనాలను అటవీశాఖ సిబ్బంది పట్టుకుంటున్నా స్మగ్లింగ్‌ మాత్రం ఆగకపోవడం గమనార్హం. ఇచ్చోడ మండలంలోని గుండాల, కేశవ్‌పట్నం, ఎల్లమ్మగూడ, జోగిపేట నుంచి కొందరు, బోథ్‌, బజార్‌హత్నూర్‌కు సమీపంలో గల మహారాష్ట్ర చిక్లి నుంచి కలప స్మగ్లర్లు అడవుల్లో చెట్లు నరికివేస్తూ నిజామాబాద్‌ వైపునకు కలపను తరలిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే గ్రామాల్లో పలుమార్లు పోలీసు, అటవీశాఖ అధికారులు సోదాలు జరిపి విలువైన కలపను స్వాధీనపర్చుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించగా మరో 12 మంది స్మగ్లర్లు ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవలే లొంగిపోయారు. అటవీ ప్రాంతాల్లో పారుతున్న నదీ, వాగుల్లో నిలిచిన ఇసుకను కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కవ్వాల్‌ టైగర్‌ రేంజి అటవీశాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిఘా కేంద్రీకరించి కలప, ఇసుక తరలింపు విషయంలో చర్యలు చేపట్టారు. మళ్లీ కొన్నిచోట్ల నుంచి ట్రాక్టర్‌ల ద్వారా తరలిస్తున్నట్లుగా సమాచారం. సిరికొండ మండలంలోని తొత్తివాగు, భీంపూర్‌, ఇచ్చోడ మండలంలోని కడెం నది వెంట బాబ్జీపేట్‌, పెంబీ మండలంలోని గుమ్మిరాల, తదితర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది