అధికారులు సమన్వయంతో సదరం క్యాంపు నిర్వహించాలి
కలెక్టరేట్ కార్యాలయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిద్ధిపేట, మే 22 (way2newstv.com)
అధికారులు సమన్వయంతో కలిసి సదరం క్యాంపు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఛైర్మనుగా, సభ్యులుగా డీఎంహెచ్ఓ అమర్ సింగ్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీడబ్ల్యూఓ జరీనా బేగంలతో కలిసి కమిటీ సమావేశం జరిపారు.
ఈ నెల 28న సిద్ధిపేటలో సదరం క్యాంపు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదిన సదరం క్యాంపు జరుగనున్నట్లు, ఇందు కోసం జిల్లాలోని వివిధ మండలాల నుంచి సదరం క్యాంపునకు వచ్చే వారికి సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరిగితే సహించేది లేదని, సదరం క్యాంపు నిర్వహించే అధికారులు సమన్వయంతో సదరం క్యాంపు విజయవంతం జరిగేలా చూడాలని కోరారు. క్యాంపులో ఏర్పడే సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు, కమిటీ చేపట్టాల్సిన విధులు, మెడికల్ బోర్డు అనుసంధానంగా సదరం క్యాంపు, ఇతరత్రా కీలక అంశాల పై కమిటీ నిర్వర్తించాల్సిన విధులపై జిల్లా వైద్య అధికారిక యంత్రాంగంతో కలెక్టర్ చర్చించారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఏరియా ఆసుపత్రితో పాటు, సిద్ధిపేట బురుజు సమీపంలోని పాత ఎంసీహెచ్ ఆసుపత్రిలో అనువైన చోట ఈ సదరం శిబిరం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్-మెప్మా పీడీ శ్రీనివాస్ రెడ్డి, డీడబ్ల్యూఓ జరీనా బేగం, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్, వివిధ శాఖలకు చెందిన అధికారిక యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.
Tags:
telangananews