హైద్రాబాద్, మే 2, (way2newstv.com)
బిగ్ బాస్ 3 సీజన్… నిర్వాహకులకు పెద్ద తలనొప్పినే తీసుకొస్తోంది. ఈ సీజన్‌ని హోస్ట్ చేసేవాళ్లని ఎంపిక చేయడం కంటే – సెలబ్రెటీలను తీసుకురావడానికే తెగ కష్టపడుతున్నారు. సీజన్ 2లో పాల్గొన్న సెలబ్రెటీలను చూసి – నొసలు చిట్లించారు బుల్లి తెర వీక్షకులు. `వీళ్లకు మించి ఇంకెవరూ దొరకలేదా` అంటూ ఎద్దేవా చేశారు. సామాన్యుల బెర్తులు కూడా ఉండడంతో.. బిగ్ బాస్ హౌస్ కళ తప్పింది. కౌశల్ లేకపోతే.. బిగ్ బాస్ 2 పూర్తిగా తేలిపోయేది. అయితే ఆ ప్రమాదం లేకుండా.. సెలబ్రెటీల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. పారితోషికం ఎక్కువైనా ఫర్వాలేదు… స్టార్లను రంగంలోకి దింపాల్సిందే అనుకొంటోంది. అయితే.. ఇప్పుడు ఆ పారితోషికం విషయంలోనే పేచీ వస్తోంది.
బిగ్ బాస్ లో రెమ్యూనిరేషన్ లొల్లి
సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో పారితోషికాలు రోజువారిగా లెక్క వేస్తారు. రోజుకి లక్ష రూపాయలు పారితోషికం ఇస్తాం అన్నారంటే.. ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారో అన్ని లక్షలు ఇవ్వాలన్నమాట. ఎక్కువ రోజులు హౌస్‌లో ఉంటే, ఎక్కువ పారితోషికం అందుకునే వీలుంటుంది. గత రెండు దఫాలుగా ఈ లెక్కనే పారితోషికం అందుకున్నారు. అయితే ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. మాకు పారితోషికం కావాలి, ప్యాకేజీ కూడా కావాలి అని సెలబ్రెటీలు డిమాండ్ చేస్తున్నార్ట. బిగ్ బాస్ హౌస్‌లో పాలుపంచుకున్నందుకు.. నికరంగా ఇంత కావాలన్నదే సెలబ్రెటీల డిమాండ్. దాంతో పాటు… రోజువారీ పారితోషికం కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నార్ట. అంటే అటు ప్యాకేజీ, ఇటు పారితోషికం రెండూ ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే… ఆర్థికంగా తడిచిమోపెడు అవుతుందని నిర్వాహకుల భయం. బిగ్ బాస్ హౌస్‌లో పాలుపంచుకున్నంత మాత్రన అవకాశాలు రావని… గత రెండు సీజన్‌లు నిరూపించాయి. శివ బాలాజీ, కౌశల్ … వీరిద్దరి కెరీర్‌లో అవకాశాల పరంగా ఊహించని మార్పులు లేవు. మిగిలినవాళ్ల పరిస్థితీ అంతే. సినిమా, టీవీ జీవితాల్నీ,కెరీర్‌నీ వదిలేసి వస్తున్నందుకు ఈ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పు లేదని సెలబ్రెటీలు అంటున్నార్ట. మరి బిగ్ బాస్ టీమ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.