క్షీణిస్తున్న పార్టీల సంబంధాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్షీణిస్తున్న పార్టీల సంబంధాలు

విజయవాడ, మే 18, (way2newstv.com)
ప్రతి అయిదేళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి. ఎవరో ఒకరు గెలుస్తుంటారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ సమానభాగస్వామ్యం వహించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ సాఫీగా నడిచేందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పరస్పరం సహకరించుకోవాలి. రాష్ట్రంలో దేశంలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. యూపీఏ, ఎన్డీఏ రెండు కూటములు, మధ్యలో తటస్థ పార్టీలు కుల,మత కుమ్ములాటగా ఎన్నికల రణక్షేత్రం మారిపోయింది. గతంలో ఈ ధోరణి లేదా? అంటే ఉంది. కానీ ఈ స్థాయి అసహనం తొలిసారి చూస్తున్నామనేది పరిశీలకుల భావన. తిట్లు, విమర్శలు, దూషణభూషణలు రాజకీయాల్లో సహజమే. కానీ ప్రత్యర్థిని సహించలేకపోవడమనేది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ప్రీతికరం కాదు. వ్యక్తుల మధ్య పెరిగిపోతున్న కక్షకార్పణ్యాలు రాజకీయాల్లో ఉండదగిన లక్షణాలు కాదు. హత్యలు చేయకపోయినా పొలిటికల్ ఫాక్షనిస్టులుగా అగ్రనేతలు మారిపోతున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిల వైరం అన్ని విలువలను నిలువెత్తున పాతిపెడుతోంది.అయిందేదో అయింది. సర్దుకు పోదాం. అంటూ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య కాంగ్రెసులో కలకలం సృష్టించింది. ఇంతకీ సిక్కు ఊచకోతలకు సంబంధించి ఆయన ఉదాసీన ధోరణితో ఈ వ్యాఖ్య చేశారు. 


క్షీణిస్తున్న  పార్టీల సంబంధాలు

ఓట్ల తో ముడిపడి ఉండటంతో హస్తం పార్టీ కలవరపాటునకు గురైంది. ఆయనతో క్షమాపణలు చెప్పించింది. అంతటి ఔదార్యాన్ని ప్రధానమంత్రి విషయంలో కనబరచడం లేదు. ఆయనను సాధ్యమైనంతవరకూ దుర్మార్గునిగా చూపించడానికే తాపత్రయపడుతోంది. మణిశంకర్ అయ్యర్ గతంలో నీచుడు అనే అర్థంలో ప్రధానిని నిందిస్తే తప్పు అని చెప్పిన కాంగ్రెసు పార్టీ ఈరోజున తానే ఈ వ్యాఖ్యలను భుజాన మోస్తోంది. మమత, మాయావతి వంటి వారి సంగతి చెప్పనక్కర్లేదు. మోడీని తిట్టినన్ని తిట్లు ఇంకెవరినీ జీవితంలో తిట్టి ఉండకపోవచ్చు. నిజానికి ప్రధాని వారికి పోటీ దారు కాదు. బహుజనసమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లోనే పట్టున్న పార్టీ. మమత పరిస్థితీ అంతే. అయితే తమ రాష్ట్రాల్లో మోడీ వల్ల బీజేపీ బలపడుతుందని, తాము సొంత స్థానాల్లోనే పట్టుకోల్పోతామనేది వారి భయం. ఫలితంగా రాజకీయ స్పర్థ వ్యక్తిగత కక్షగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీసీలు ఎన్నికల తర్వాత ఏదో ఒక పక్షమే మిగాలన్నంత కసిగా పోరాడాయి. ప్రజాస్వామ్య ఎన్నిక అన్న సంగతి పక్కనపెట్టేసి జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి.కామ్రేడ్లు, కమలం పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనాలి. కానీ రాజకీయ అవసరాల కోసం పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరిస్తున్నారనే విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమబంగలో మమత ధాటికి కమ్యూనిస్టు కోటలు కకావికలమైపోయాయి. కాంగ్రెసు అక్కడక్కడ మిణుకుమిణుకుమంటోంది. కాషాయ పార్టీ కాసింత వెలుగులు విరజిమ్మే ప్రయత్నం చేస్తోంది. సైద్ధాంతికంగా తీవ్ర వైరుద్ధ్యాలు కలిగిన పార్టీలు దేశంలో రెండే కనిపిస్తాయి. వామపక్షాలు, బీజేపీ ఆగర్భశత్రువులుగా ప్రవర్తిస్తాయి. కాంగ్రెసుతో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబరుస్తాయేమో తప్ప అవి రెండూ సహకరించుకోవడం జరగదనేది నిన్నటిమాట. త్రుణమూల్ కు చెక్ పెడితే తప్ప మనుగడకే కష్టమనుకుంటున్న కమ్యూనిస్టులు చివరికి బీజేపీకి కూడా సహకరించేందుకు పశ్చిమబంగ లో సిద్దమైపోతున్నారనేది సమాచారం. ఇటువంటి విధానం పార్టీకి ఆత్మహత్యాసద్రుశమంటూ సీపీఎం సీనియర్ నేత మాణిక్ సర్కార్ హెచ్చరించడంతోనే అసలు విషయం వెలుగు చూసింది. పార్టీలు సిద్ధాంతాలు, చింతకాయా అంటూ పట్టుకుని వేలాడకుండా ఎంతకైనా దిగిపోతున్నాయన్న సంగతి అర్థమైపోతోంది.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అసహనానికి పరాకాష్ఠగా చెప్పుకోవాలి. ఎన్నికల ఘట్టం ముగిసింది మొదలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, టీడీపీల మధ్య ప్రత్యక్ష యుద్ధమే సాగుతోంది. చంద్రబాబు నాయుడికి ఇక ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చొనే అర్హత లేదన్నట్లుగా వైసీపీ ప్రవర్తిస్తోంది. పధ్నాలుగేళ్ల పైచిలుకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం పేచీలకు దిగుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న దశలో లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేయడం ఉత్తమం. ఎందుకంటే నిధుల విడుదల అనుమతులు, విధానపరమైన నిర్ణయాలు, బిల్లుల చెల్లింపు వంటివి చేయడానికి వీలు కాదు. కనీసం విలేఖరుల సమావేశం పెట్టి కేబినెట్ నిర్ణయాలను ప్రకటించడానికి సైతం సవాలక్ష షరతులు. అంతటి ఇబ్బందికర స్థితిలో పంతాలకు, పట్టుదలకు పోయి చంద్రబాబు నాయుడు సాధించేదేమిటో అర్థం కాదు. మరోవైపు కేబినెట్ సమావేశాలను సంతాపసమావేశాలుగా అభివర్ణించేందుకు దిగజారింది విపక్షం. ఈ రెండు పార్టీలు కచ్చితంగా ఒకరు ప్రతిపక్షంలో మరొకరు అధికారపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. ముఖాముఖాలు చూసుకోలేని దశకు సంబంధాలు క్షీణించాయి. ఏదో ఒక సాకు చూపి అయిదేళ్లు ఒకపార్టీ వాళ్లు అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తారేమోననే భయం ప్రజాస్వామ్య హితైషులను వెన్నాడుతోంది. ఎన్నికలు జరిగేంతవరకూ సరే. ఫలితాల కోసం చూస్తున్న తరుణంలో అంతటి కార్పణ్యాలు అవసరమా? అన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న.