పంజాబ్ టీమ్ పై వేటు తప్పదా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంజాబ్ టీమ్ పై వేటు తప్పదా

ముంబై, మే 2, (way2newstv.com)
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ మరోసారి ఆటేతర అంశంతో వార్తల్లో నిలిచింది. ఆ జట్టు సహ యజమాని నెస్ వాడియాకి డ్రగ్స్ కేసులో రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ జపాన్ కోర్టు తాజాగా తీర్పు వెలువడించింది. రెండు నెలల క్రితం 25 గ్రాముల డ్రగ్స్‌తో జపాన్‌లోని న్యూ చిటోసే విమానాశ్రయంలో నెస్ వాడియా పట్టుబడ్డాడు. దీంతో.. విచారణ జరిపిన కోర్టు తాజాగా జైలు శిక్ష విధించింది. ఐపీఎల్ నియామవళి ప్రకారం టీమ్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వ్యక్తిపై ఏదైనా నేరం రుజువైన లేదా టోర్నీకి అప్రతిష్ట చేసే పనులు చేసినా.. ఆ జట్టు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


పంజాబ్ టీమ్ పై వేటు తప్పదా

గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓనర్, కో ఓనర్ చేసిన స్ఫాట్ ఫిక్సింగ్ నేరాలకి ఆ రెండు జట్లూ నిషేధాన్ని ఎదుర్కొని.. 2016, 2017 ఐపీఎల్‌ సీజన్‌లకి దూరమైన విషయం తెలిసిందే. దీంతో.. ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కూడా చిక్కుల్లో పడింది. ఐపీఎల్ తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్లేఆఫ్ రేసులోనే ఉంది. ఆ జట్టు లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. నెస్ వాడియా డ్రగ్స్ కేసు విషయమై బీసీసీఐ పాలకుల కమిటీ శుక్రవారం చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ సమావేశంలో తుది నిర్ణయానికి కమిటీ రాలేని పక్షంలో.. ఇటీవల కొత్తగా నియమితులైన బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ డీకే జైన్‌ వద్దకి ఈ అంశాన్ని తీసుకువెళ్లే సూచనలూ కనిపిస్తున్నాయి.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కి మరో సహ యజమానిగా ఉన్న ప్రతీజింటా 2014లో తనని నెస్ వాడియా లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. అయితే.. అప్పట్లో తీవ్ర చర్చలు, వాదనలు నడుమ ప్రీతి జింటా మళ్లీ కేసును వెనక్కి తీసుకోగా.. తాజాగా మరో ఆటేతర అంశంతో పంజాబ్ చిక్కుల్లో పడింది. దీంతో.. బీసీసీఐ వివరణ కోరుతుందా..? లేక చర్యలు తీసుకుంటుందా..? అనేది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది. ఒకవేళ సస్పెన్షన్ విధిస్తే.. 2020 ఐపీఎల్ సీజన్‌ నుంచి అది అమల్లోకి రానుంది.