బెగుసరాయ్ లో కన్హయ్య గెలుపుపై సీపీఐ ఆశలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెగుసరాయ్ లో కన్హయ్య గెలుపుపై సీపీఐ ఆశలు

పాట్నా, మే 6, (way2newstv.com
లాల్ కన్హయ్య…. రెండేళ్ల క్రితం రాజకీయ తెరపైకి వచ్చిన ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సంఘం అధ్యక్షుడిగా, ఎన్టీఏ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ విమర్శకుడిగా కన్హయ్య పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా బీహార్ లోని ‘‘బెగుసరాయ్’’ నుంచి సీపీఐ అబ్యర్థిగా లోక్ సభ కు కన్హయ్య పోటీ చేస్తుండటం దేశ వ్యాప్తంగా ఈ నియోజకవర్గం ప్రజల దృష్టిని ఆకట్టుకుంటోంది. జాతీయ స్థాయిలో వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ ప్రాభవం కొడిగడుతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్ సభలో ఒకే ఒక సీటుంది. తాజాగా బెగూసరాయ్ నుంచి కన్హయ్య పోటీచేస్తుండటంతో విజయావకాశాలపై సీపీఐలో ఆశలు రేకెత్తాయి. భూమిహార్ సామాజిక వర్గానికి చెందిన కన్హయ్యను ఢీకొనేందుకు, అదే సామాజిక వర్గానికి చెందిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ను బీజపీ రంగంలోకి దించింది. బెగుసరాయ్ స్థానానికి నాలుగో దశలో భాగంగా ఈ నెల 29వ తేదీన ఎన్నిక జరగింది.గత ఎన్నికల్లో 4.28 లక్షల ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి భోలాసింగ్ విజేతగా నిలిచారు. 3.69 లక్షల ఓట్లతో ఆర్జేడీ అభ్యర్ధి తన్వీర్ హసన్ రెండోస్థానంలోనూ, 1.92 లక్షల ఓట్లతో సీపీఐ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ సింగ్ తృతీయ స్థానంలో నిలిచారు. 


బెగుసరాయ్ లో కన్హయ్య గెలుపుపై సీపీఐ ఆశలు

ఈ నియోజకవర్గం పరిధిలో చెరియా బరియాపూర్, బబ్బదర, టిష్రూ, నూటిహాని, బెగుసరాయ్, భద్రి, సాహెబ్ పూర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. బెగుసరాయ్ స్థానం మొదటి నుంచి కమ్యునిస్టులకు కంచుకోట. అందువల్లే దానిని ‘‘లెనిన్ గాడ్ ఆఫ్ బీహార్’’ అని పిలుస్తారు. ఆది నుంచి ఇక్కడ కమ్యునిస్టులు భూ పోరాటాలు సాగించారు. పేదలకు అనుకూలంగా, ప్రభుత్వ వ్యతిరేక, అణిచివేత విధానాలపై పోరాడారు. దీంతో సీపీఐ ఈ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ప్రాంతానికి చెందిన సీపీఐ నాయకుడు చంద్రశేఖర్ సింగ్ గౌరవనీయ నాయకుడిగా ఎదిగారు. విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ లో కార్యకర్తగా కొనసాగిన కన్హయ్య ఇప్పుడు తన స్వస్థలమైన బెగుసరాయ్ నుంచి బరిలోకి దిగారు. కన్హయ్యతో పాటు, ఈ ప్రాంతంలో పార్టీ స్థాపనకు విశేషంగా కృషి చేసిన చంద్రశేఖర్ సింగ్ ఇద్దరూ బిహాత్ గ్రామానికి చెందిన వారు. చంద్రశేఖర్ సింగ్ తండ్రి, కన్హయ్య తాత అన్నదమ్ములు. ఇదంతా చరిత్ర. ఒకప్పుడు సీపీఐ కి కంచుకోట అయిన బెగుసరాయ్ లో ఆ పరిస్థితి లేదు. అన్ని చోట్ల మాదిరిగానే ఇక్కడ కూడా సీపీఐ ప్రాభవం కొడగడుతోంది. అయితే ఇప్పటికీ పార్టీ మూలాలు బలంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొదటి నుంచి ‘‘భూమి హార్’’ సామాజికవర్గం సీపీఐకి దన్నుగా ఉంటుంది. కన్హయ్య కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వాడు కావడం గమనార్హం.ప్రస్తుతం బెగూసరాయ్ లో త్రిముఖ పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్ ఇప్పుడు కూడా బరిలో ఉన్నారు. సీపీఐ, బీజేపీలకు ఆయన గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ నియోజకవర్గంలో భూమిహార్ సామాజికవర్గం అత్యంత కీలకం. ఈ సామాజికి వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు నాలుగు లక్షల మంది వరకూ ఉన్నట్లు అంచనా. గత ఎన్నికల్లో మోదీ గాలిలో బీజేపీ గెలిచింది. వాస్తవానికి ఇక్కడ ఆ పార్టీకి పట్టులేదు. ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ అందరీకి అందుబాటులో ఉంటారు. అందరితో కలసిపోయే స్వభావం. వ్యక్తిగతంగా మంచిపేరుంది. మూడు లక్షలకు పైగా ముస్లిం ఓటర్లు, రెండున్నర లక్షలకు పైగా గల యాదవ ఓటర్లపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఆర్జేడీ పరా్టీ మద్దతు ఇచ్చినట్లయితే సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్ గెలుపు నల్లేరు మీద నడకే అయ్యేది. ఇప్పుడు ఆర్జేడీ, సీపీఐ, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. దీనివల్ల ఓట్లు చీలిపోయే ప్రమాదముందని అభ్యర్థులు భయపడిపోతున్నారు.లాల్ కన్హయ్య సాదాసీదా ప్రచారం చేశారు. సైకిల్, స్కూటర్, జీపుల్లో ప్రచారం చేశారు. ఒక్కోసారి పాదయాత్ర ద్వారా కూడా ప్రచారం నిర్వహించారు. ప్రజలనుంచి చందాలు సేకరించారు. వంద నుంచి వెయ్యి వరకూ చిన్న మొత్తాలను కూడా చందాలుగా తీసుకున్నారు. పేదరిక నిర్మూలన, అత్యాచారాలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమని ప్రచారం చేశారు. విద్యార్థి సంఘం నాయకుడైన తనకు వారి సమస్యలు తెలుసునని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన గిరిరాజ్ సింగ్ కు హడావిడి, ఆర్భాటం ఎక్కువ. బీజేపీ అతివాద నాయకుల్లో సింగ్ ఒకరు. హిందూ మత పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రచారం చేశారు. అధిష్టానం ఆదేశం మేరకు కన్హయ్య కుమార్ పేరు ప్రస్తావించకుండా ప్రచారాన్ని ముగించారు. కన్హయ్యకు మద్దతుగా జిగ్నేష్ మెవాని, బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, ఆయన భార్య షబానా ఆజ్మీ, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్ వంటి వారు ప్రచారం చేశారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది.