భూగర్భమే దిక్కు..! (శ్రీకాకుళం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భూగర్భమే దిక్కు..! (శ్రీకాకుళం)

శ్రీకాకుళం, మే 17 (way2newstv.com):  
తుపాన్ల వల్ల ఎక్కువ నష్టపోయేది ఉద్దానం ప్రాంతంలోని విద్యుత్తు వ్యవస్థే. ‘తిత్లీ’ తుపాను వేళ 55 వేల స్తంభాలు నేలకొరిగాయి. తూర్పుప్రాంత విద్యుత్తు సంస్థకు రూ.359 కోట్ల నష్టాలు తెచ్చింది. ఆరు నెలలు తిరక్కముందే వచ్చి పడిన ‘ఫొని’ రెండు వేల వరకు స్తంభాలను నేలకూల్చింది. రమారమి రూ.10 కోట్ల నష్టాలను చవి చూపించింది. స్తంభాలు పాతిపెట్టి.. వాటిపై ఓవర్‌ హెడ్‌ లైన్‌ వ్యవస్థతో నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోజుల తరబడి కరెంటు లేక ప్రజలు చీకట్లో మగ్గాల్సి వస్తోంది. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుతోనే ఈ తరహా సమస్య అధిగమించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నది అధికార వర్గాల విశ్లేషణ. ఖర్చు అధికంగా ఉంటుందనుకుంటే.. కనీసం మండల కేంద్రాలు, ప్రధాన పట్టణాల వరకైనా పరిమితం చేయొచ్చనేది ఆ వర్గాల మనోగతం.భూగర్భ విద్యుత్తు వ్యవస్థ వివిధ రూపాల్లో పటిష్టంగా ఉంటుంది. గోతుల్లో ఇసుక వేసి.. దానిపై పీసీసీ చట్రాన్ని అమర్ఛి. దానిపై పీవీసీ కండక్టరు అమర్చాల్సి ఉంటుంది. ‘ఇన్సులేషన్‌’ కవరింగు చేసిన తీగలను అమర్చాల్సి ఉంటుంది. కరెంటు సరఫరా సమయంలో దీన్ని తాకినా షాకు కొట్టని విధంగా చేసే ఏర్పాటు ఇది. 


భూగర్భమే దిక్కు..! (శ్రీకాకుళం)

అవకాశం ఉన్నచోట 33కేవీ, 11 కేవీ, ఎల్‌.టీ తీగలను ఒకే మార్గంలో అమర్చుకోడానికి వెసులుబాటు ఉంటుంది. తరవాత అవి ఎటూ కదలకుండా చేస్తారు. తరువాత దాన్ని పూడ్చేస్తారు. మొత్తం ఎంత ఖర్చవుతుందనేది పూర్తిస్థాయిలో సర్వే చేస్తే వెల్లడవుతుంది. తరచూ కరెంటు పోతుండటం.. రావడం వంటి సమస్యలను నిరోధించవచ్ఛు తీగలకు ఏమాత్రం చెట్ల ఆకులు తగిలినా ఒక్కోసారి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. ఈ క్రమంలో విద్యుత్తు సంస్థ చెట్ల కొమ్మలు, ఆకులు తొలగిస్తుంటారు. భూగర్భ వ్యవస్థ వల్ల ఇలాంటివాటికి తావుండదు. రోడ్లకు ఇరువైపులా రూ.లక్షల వ్యయం చేసి పెంచుతున్న చెట్లను నరికి పడేస్తున్నారన్న అపవాదులు ఉండవు. పర్యవసానంగా పర్యావరణానికి మేలు చేసినట్లవుతుంది. తరచు సంభవిస్తున్న తుపాను విపత్కర పరిస్థితులే కాదు.. ఎలాంటి విపత్తులు సంభవించినా.. ఎన్ని కి.మీ. వేగంతో గాలులు వీచినా భయం ఉండదు. సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు వీలవుతుంది. ప్రధాన రహదారులు సహా ఏ రోడ్ల పక్కన విద్యుత్తు స్తంభాలు కనిపించవు.. సర్వీసులు వైర్లూ కనిపించవు కనుక... పట్టణాలు చూడముచ్చటగా ఉంటాయి. రాకపోకలకు అంతరాయం ఉండదు. దుకాణాదారులకూ ఇబ్బందులు తొలగిపోతాయి.ఎప్పుడు తుపాన్లు సంభవించినా.. తరచు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి ప్రాంతాలే వైపరీత్యాలకు గురవుతున్నాయి. వీటి పరిధిలో దాదాపు 36 వరకు సబ్‌-స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో సబ్‌-స్టేషన్‌ పరిధిలో 33కేవీ లైన్లు సుమారుగా 8 నుంచి 10 కి.మీ పొడవును విస్తరించి ఉన్నాయి. ఒక్కో సబ్‌-స్టేషన్‌ పరిధిలో మూడునాలుగు ఫీడర్లు ఉంటాయి. సబ్‌-స్టేషన్ల నుంచి ఫీడర్లకు 11 కేవీ లైన్ల ద్వారా పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (5ఎం.ఈ)కు కరెంటు సరఫరా అవుతుంటుంది. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లకు ఈ 11 కేవీ లైన్ల ద్వారానే కరెంటును సరఫరా చేస్తారు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి 3ఫేజ్‌ అయితే 440 ఓల్ట్స్‌.. సింగిల్‌ ఫేజ్‌ అయితే.. 230 ఓల్ట్స్‌ సరఫరా చేసేందుకు మళ్లీ విడివిడిగా లైన్ల ద్వారా సరఫరా ఉంటుంది. ఇలా ఒక్కొ సబ్‌-స్టేషన్‌ పరిధిలో 11కేవీ
లైన్లు 30-40 కి.మీ వరకు విస్తరించి ఉంటాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ల నుంచి ఎల్‌.టి లైన్ల ద్వారా.. ఇళ్లకు ఉండే సర్వీసులకు కనెక్షన్లు ఇస్తారు. నేరుగా ఇళ్ల సర్వీసులకు ఇచ్చే కనెక్షన్లు అన్నీ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచే వెళ్తాయి. ఒక్కో ఫీడర్‌మీద 40-60-70 వరకు ట్రాన్స్‌ఫార్మర్‌ లైన్లు ఉంటాయి. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఇళ్లకు వెళ్లేవి ఎల్‌.టీ లైన్లు. ఇక్కడి నుంచి స్తంభాలు నిర్మించి.. స్తంభాలకు ఉండే తీగల ద్వారా ఊళ్లలోకీ ఎల్‌.టీ లైన్‌ వేస్తారు. ఇలా ఒక్కో 20కి.మీ వరకు ఎల్‌టీ లైన్‌ ఉండొచ్చని విద్యుత్తు సంస్థ వర్గాలు విశదీకరిస్తున్నాయి.