ఇక ఆన్ లైన్ లో సర్వీస్ రిజిస్టర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక ఆన్ లైన్ లో సర్వీస్ రిజిస్టర్లు

గుంటూరు, మే 1, (way2newstv.com)
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్ ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు మాన్యువల్‌గా ఉన్న సర్వీసు రిజిస్టర్‌ను ఈ-ఎస్‌ఆర్‌గా మార్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. తొలుత ఎస్‌ఆర్‌ను డిజిటలైజేషన్ చేయాలనుకున్నప్పటికీ మార్పులు, చేర్పులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థికశాఖ అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో ఈ-ఎస్‌ఆర్ రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టులోగా ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిచేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ-ఎస్‌ఆర్‌ను ఉద్యోగులు తమ ట్రెజరీ ఐడీడి నెంబర్ ద్వారా లాగిన్ అయి వివరాలను చూసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. మెరుగైన విధానంతో రూపొందుతున్న ఈ-ఎస్‌ఆర్‌తో భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఉద్యోగి వ్యక్తిగత వివరాలు, అర్హతలు, ఉద్యోగ, కుటుంబ వివరాలు, ఉద్యోగ జీవితంలోని వివరాల సమగ్ర పట్టికను సర్వీసు రిజిస్టర్‌గా పిలుస్తారు. దాదాపు 100 పేజీల ఈ పుస్తకాన్ని తన సర్వీసు కాలమంతా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆయా శాఖాధిపతులు ఈ పుస్తకం (సర్వీసు రిజిస్టర్)లో వివరాలన్ని నమోదు చేశారు. ఉద్యోగికి సంబంధించి శాఖాధిపతుల దగ్గర ఈ పుస్తకం ఒక్కటే ఉంటుంది. 


ఇక ఆన్ లైన్ లో సర్వీస్ రిజిస్టర్లు

కనిపించకుండా పోయినా, ధ్వంసమైనా, కాలిపోయినా తిరిగి తయారు చేయడం కష్టసాధ్యం. దీంతో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వీసు రిజిస్టర్లను ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తారు. ప్రస్తుతం ఈ-ఎస్‌ఆర్ ఫార్మెట్ ప్రకారం ఉద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అవసరమైన సర్ట్ఫికెట్లను సంబంధిత శాఖాధిపతులకు అందజేయాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించాక ఉద్యోగులు తమ ట్రెజరీ ఐడి నెంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎస్‌ఆర్‌లో ఇప్పటివరకు పొందుపర్చిన వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ సమయంలో పుట్టిన తేదీ, ఇంక్రిమెంట్లు వంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. పాత ఎస్‌ఆర్‌కు, ఈ-ఎస్‌ఆర్‌కు ఎటువంటి తేడాలు ఉన్నా అందుకు శాఖాధిపతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. పింఛన్ వివరాలు, నామినీ పేరు మార్చుకోవచ్చని సూచించింది. అప్‌లోడ్ సమయంలో ఆయా వివరాలను ఒకటికి పదిసార్లు సరి చూసుకోవాలని, సందేహాలు ఏమైనా ఉంటే సంబంధిత శాఖాధిపతుల ద్వారా నివృత్తి చేసుకుని అప్‌లోడ్ చేసుకోవాలని ఆర్థిక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకసారి అప్‌లోడ్ అయితే ఆన్‌లైన్‌లో చూసుకోవడమే తప్ప మార్పులకు ఎటువంటి అవకాశం ఉండదని ఆర్థికశాఖ స్పష్టం చేస్తోంది. అప్‌లోడ్ అయ్యాక ఉద్యోగులు తమ ట్రెజరీ ఐడి నెంబర్ ద్వారా ఈ-ఎస్‌ఆర్‌ను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చూసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ-ఎస్‌ఆర్‌లో 12 దశల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగికి సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో బదిలీలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవుల ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సర్వీసు రిజిస్టర్లను భద్రపర్చుకునే అవసరం ఇకపై ఉండదు. ఒకసారి వివరాలు అప్‌లోడ్ అయ్యాక ఇతర అధికారులు, సంబంధం లేని వ్యక్తులు ఎంట్రీలు వేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని, సర్వీసు రిజిస్టర్‌ను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని ఆర్థికశాఖ స్పష్టం చేస్తోంది. పదవీ విరమణ సమయంలో అన్ని వివరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఉద్యోగికి అందే పరిహారం, పెన్షన్ తక్షణం మంజూరయ్యేందుకు వీలు కలుగుతుంది. మొత్తమీద ఈ-ఎస్‌ఆర్‌తో ఉద్యోగులకు మేలు కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.