నేను ఏమైనా తీవ్రవాదినా : రవి ప్రకాష్ ఆవేదన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేను ఏమైనా తీవ్రవాదినా : రవి ప్రకాష్ ఆవేదన


హైద్రాబాద్, మే 22, (way2newstv.com)
టీవీ9 వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ న్యూస్ ఛానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ తొలిసారిగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ  ఓ వీడియో విడుదల చేశారు. తనపై కొంత మంది కావాలనే కుట్ర పన్నారని.. ఉగ్రవాది కంటే హీనంగా చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ9 సంస్థను స్థాపించింది తానేనని.. దేశంలో న్యూస్ ఛానెళ్లన్నీ నష్టాల బాటలో నడుస్తున్న సమయంలో టీవీ9ను లాభాల బాటలో నడిపించానని తెలిపారు. అలాంటి తనను పోలీసుల అండతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని రవిప్రకాశ్ ఆరోపించారు. ‘టీవీ9 న్యూస్ ఛానెల్‌ను స్థాపించింది నేను. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని లాభాల బాటలో నడిపించింది నేను. శ్రీనీరాజు ఆర్థికంగా అందగా నిలిచారు. విలువలకు కట్టుబడి టీవీ9 సంస్థను నడిపించాం. అనేక రాష్ట్రాల్లో నం.1 న్యూస్ ఛానెల్‌గా టీవీ9 ఎదిగింది’ అని రవిప్రకాశ్ తెలిపారు. టీవీ9 మంచి లాభాల బాటలో సాగుతుండగా.. సంస్థలో వాటాదారుగా చేరతానంటూ మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చారని రవిప్రకాశ్ తెలిపారు. ఒప్పందం విషయంలో ఆయన చెప్పింది వేరు.. 
నేను ఏమైనా తీవ్రవాదినా : రవి ప్రకాష్ ఆవేదన


ఒప్పందం జరిగింది వేరని ఆయన చెప్పుకొచ్చారు. 20 శాతం వాటాలు అమ్మడానికి ఒప్పందం కుదరగా.. మధ్యలో రామేశ్వర్ రావు (మై హోమ్స్ అధినేత) ఎంట్రీ ఇచ్చారని.. మెజారిటీ వాటాతో టీవీ9లో వాటాలు దక్కించుకున్నారని రవిప్రకాశ్ వివరించారు.టీవీ9 వ్యవహారంలో స్పందించిన రవిప్రకాష్రామేశ్వర్ రావు.. టీవీ9లో మెజార్టీ వాటాలు దక్కించుకున్న తర్వాత తనను ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారని రవిప్రకాశ్ ఆరోపించారు. ‘నేను విలువలకు కట్టుబడి ఛానెల్‌ను నడుపుదామనుకున్నా.. కానీ, నేను మైనార్టీ స్టాక్ హోల్డర్‌ననీ.. వాళ్లు చెప్పినట్లు చేయాల్సిందేనన్నారు. వాళ్లవద్ద నన్ను ఓ జీతగాడిగా, పాలేరుగా పనిచేయాలని చెప్పారు. లేకపోతే ఇబ్బందులకు గురిచేస్తామని హెచ్చరించారు’ అని రవిప్రకాశ్ వివరించారు. రామేశ్వర్ రావు చెప్పినట్లుగా తాను వినకపోవడంతో కక్షసాధింపు చర్యలు ప్రారంభించారని.. తనను సంస్థ నుంచి బయటకి తరిమే ప్రయత్నాలు మొదలుపెట్టారని రవిప్రకాశ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 3 దొంగ కేసులు బనాయించారని ఆరోపించారు. తనపై నమోదు చేసిన కేసులన్నీ అక్రమంగా బనాయించినవేనని తెలిపారు. సినీ నటుడు శివాజీతో తాను ఓ ప్రైవేట్ ఒప్పందం చేసుకున్నట్లు అక్రమంగా కేసు పెట్టారని రవిప్రకాశ్ ఆరోపించారు. సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా చేరిన, హోదాలో తనకంటే చిన్నవాడైన దేవేందర్ అగర్వాల్ అనే వ్యక్తి సంతకం ఫోర్జరీ చేసినట్లు మరో కేసు బనాయించారని చెప్పారు. నిజానికి అతడితో దొంగ పత్రాలు అప్‌లోడ్ చేయించే ప్రయత్నం చేసి విఫలమై తనపై తప్పుడు క్రిమినల్ కేసు పెట్టారని తెలిపారు. ఇక టీవీ9 లోగోను అమ్ముకున్నాడంటూ మరో కేసు పెట్టారని రవిప్రకాశ్ తెలిపారు. సంస్థను కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ విషయం తెలుసుకోకుండా ఒప్పందం చేసుకోవడం హాస్యాస్పదం అన్నారు. లోగోకు సంబంధించిన సర్వహక్కులు తనవేనని.. టీవీ9 లోగోకు యజమాని రవిప్రకాశ్ అని వివరించారు. తనకు రావాల్సిన రాయల్టీని ఎగ్గొట్టే క్రమంలో ఈ దొంగ నాటకానికి తెరలేపారని ఆరోపించారు. మై హోమ్స్ గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు.. తనకు సంబంధించిన మీడియా సంస్థలతో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని రవిప్రకాశ్ ఆరోపించారు. వారంతా తాత్కాలిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులను ప్రభావితం చేసి తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇంతగా దిగజారాలా? ధనికస్వాములకు భయపడి ఊడిగం చేయాలా? నేను ఎల్లప్పుడూ విలువలకు కట్టుబడి పనిచేశాను. ఇకపై అలాగే ఉంటాను. భవిష్యత్ తరాలు నన్ను ఆవిధంగానే గుర్తుపెట్టుకుంటాయి. ఈ క్రమంలో ఎన్ని కుట్రలు జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా. భయాన్ని పూర్తిగా పక్కనబెట్టి ముందుకెళ్తా..’ అని రవిప్రకాశ్ చెప్పారు. రవిప్రకాశ్ అనే తీవ్రవాది దేశం వదిలి పారిపోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటివి మంచిది కాదని రవిప్రకాశ్ అన్నారు. ‘ఈ దిశగా నేనొక అడుగు వేస్తున్నా.. నాకు అందరూ సహకరించాలి..’ అంటూ ఆయన ముగించారు. ఇదేమి న్యాయం... రవి ప్రకాషా...అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఆ చానల్‌ నూతన యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ రవిప్రకాశ్‌ విడుదల చేసిన వీడియోపై చానల్‌ యాజమాన్యం స్పందించింది. ఈ వీడియోలో రవిప్రకాశ్‌ చేసిన ఆరోపణలను టీవీ9 యాజమాన్యం ఖండించింది. తప్పుడు కేసులైతే పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది. టీవీ9 సంస్థకు చెందిన లోగోను తన సొంతమనడంపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీసీఎల్‌ సంస్థలో మెజారిటీ వాటా లేకున్నా పెత్తనం చెలాయించేందుకు రవిప్రకాష్‌ యత్నించాడని, పలు అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించింది. తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకు తిరగడమని నిలదీసింది.ఇక టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని రవిప్రకాశ్‌ ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు